త్రుటిలో తప్పిన ఎన్‌కౌంటర్‌

20 Jul, 2017 19:32 IST|Sakshi

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం జంగాలపల్లిలో గురువారం త్రుటిలో భారీ ఎన్‌కౌంటర్‌ తప్పింది. గ్రామంలోని ఓ రహస్య ప్రాంతంలో న్యూడెమోక్రసీ నక్సల్స్‌ పంచాయితీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడికి వెళ్లారు. అయితే పోలీసులు వస్తున్నారనే సమాచారం అందుకున్న దళ సభ్యులు క్షణాల్లో అక్కడి నుంచి పారిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ శ్యాం దళం సభ్యులు గురువారం ఉదయం మండలంలోని జంగాలపల్లిలో ఓ పంచాయితీ చేయడానికి వచ్చారు. ఏడుగురు దళ సభ్యులు ఇరుపక్షాల వారితో పంచాయితీ నిర్వహిస్తుండగా, పోలీసులకు సమాచారం అందింది.

దీంతో ఎస్సైలు సతీశ్, బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లారు. గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న దళ సభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు, దళ సభ్యులు ఎదురుపడితే కాల్పులు, ప్రాణ నష్టం జరిగి ఉండేదని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పంచాయితీ జరిగిన ఇంట్లో సోదాలు చేయగా 8 కిట్‌ బ్యాగులు, టార్పాలిన్‌ కవర్, ఓ సెల్‌ఫోన్, పాదరక్షలు లభించినట్లు సీఐ రమేశ్‌నాయక్‌ వెల్లడించారు. దళ సభ్యులకు ఎవరైనా సహకరించినట్లు తెలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పంచాయితీల పేరుతో దళ సభ్యులను సంప్రదించడం మానుకోవాలని హితవు పలికారు. న్యూడెమోక్రసీ సానుభూతిపరులు దుప్పటి శ్రీను, అజ్మీర వీరు, అజ్మీర రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. విచారణ అనంతరం తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి ముందు బైండోవర్‌ చేశామన్నారు.

మరిన్ని వార్తలు