చంద్రమౌళి విడుదలకు రంగం సిద్ధం

19 Mar, 2019 04:30 IST|Sakshi
చంద్రమౌళి (ఫైల్‌)

మావోయిస్టు నేత జీవితఖైదు కొట్టివేస్తూ బాల్‌గఢ్‌ కోర్టు తీర్పు

14 ఏళ్లుగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర జైళ్లలో శిక్ష

భీమదేవరపల్లి: మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్‌ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి అలియాస్‌ మదన్‌లాల్‌ శిక్షను రద్దు చేస్తూ బాల్‌గఢ్‌ కోర్టు రెండ్రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రమౌళి విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన 14 ఏళ్లుగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర జైళ్లలో శిక్ష అనుభవి స్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కి చెందిన ఉగ్గె కనకయ్య–సూరమ్మ దంపతుల పెద్ద కుమారుడు చంద్రమౌళి ఏడో తరగతి వరకు స్వగ్రామంలో చదివి పైచదువులకు హుజురాబాద్‌కు వెళ్లాడు.

పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ నక్సలైట్‌ ఉద్యమానికి ఆకర్షితుడై సానుభూతిపరుడిగా పనిచేశారు. విప్లవోద్యమానికి ఆకర్షితుడై 1981లో అడవిబాట పట్టాడు. దళ సభ్యుడిగా పనిచేస్తూ అనతికాలంలోనే హుస్నాబాద్, హుజురాబాద్‌ సీవోగా పనిచేశారు. రాష్ట్ర,కేంద్ర కమిటీల సభ్యుడిగా నియమితులయ్యారు.  2005 ఆగస్టు 6న మహారాష్ట్రలోని నాగపూర్‌లో అరెస్టు అయ్యాడు.  చంద్రమౌళిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో సుమారు 40 కేసులు ఉన్నాయి.  మధ్యప్రదేశ్‌లోని అప్పటి రవాణశాఖ మంత్రి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితునిగా చంద్రమౌళిని పేర్కొంటూ 2015 ఆగస్టు 14న జీవిత ఖైదు విధిస్తూ బాలగఢ్‌ కోర్టు తీర్పు ఇచ్చింది.
 

మరిన్ని వార్తలు