మావోయిస్ట్‌ అగ్రనేత జంపన్న లొంగుబాటు

24 Dec, 2017 02:39 IST|Sakshi

తొర్రూరు/మహదేవపూర్‌: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామానికి చెందిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్‌ జంపన్న హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. చెర్లపాలెంకు చెందిన జినుగు యశోదమ్మ, మల్లారెడ్డిల కుమారుడైన నర్సింహారెడ్డి 1977–78 వరకు చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్‌లోని మల్లెపల్లి వద్దనున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 1978–79లో టర్నర్‌ కోర్సు పూర్తి చేసి రెండేళ్లపాటు ప్రైవేటు కంపెనీలో అప్రెంటీస్‌ చేశాడు. 1984లో తన నాన్నమ్మ, స్నేహితుడు గోపాల్‌రెడ్డి మరణించినçప్పుడు పరామర్శ కోసం గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లిన నర్సింçహారెడ్డి 1985లో అప్పటి సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌లో చేరాడు.

పార్టీలో జంపన్నగా దళసభ్యుడి స్థాయి నుంచి ఏరియా కమిటీ, జిల్లా, రాష్ట్ర కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతికి ముఖ్యఅనుచరుడిగా పేరున్న జంపన్న ఛత్తీస్‌గఢ్‌–ఒడిశా బార్డర్‌ కమిటీ కార్యదర్శిగా చాలా కాలం పనిచేశారు. అనేక ఎన్‌కౌంటర్లలో ప్రత్యక్షంగా పాల్గొని మృ త్యుంజయుడిగా బయటపడ్డాడు. 1999లో మహదేవపూర్‌ మండలంలోని అన్నారం అడవుల్లో మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు హత్యలో కీలకపాత్ర పోషించాడు. ఎంసీసీ– పీపుల్స్‌వార్‌ విలీనం సందర్భంగా జరిగిన చర్చల్లో కీలకపాత్ర పోషించిన జంపన్న.. ఆధిపత్య పోరులో అలసిపోయి వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ నాయకుడి ద్వారా జంపన్న దంపతులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. జంపన్న తలపై రూ.24 లక్షల రివార్డు ఉండగా, వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన ఆయన భార్య హింగే రజితపై రూ.20 లక్షల రివార్డు ఉంది.

కొడుకును చూసి మరణించాలనే..
ఉద్వేగానికిలోనైన జంపన్న తల్లి యశోదమ్మ  
కాజీపేట: ఎన్నో ఏళ్లుగా కొడుకును చూసి మరణించాలనే తన ఆకాంక్షను భగవంతుడు ఇన్నాళ్లకు కరుణించడం ఆనందంగా ఉందంటూ మావోయిస్టు అగ్రనేత జినుగు నర్సింహారెడ్డి అలియాస్‌ జంపన్న తల్లి యశోదమ్మ ఉద్వేగానికి గురయ్యారు. ఆయన హైదరాబాద్‌లో పోలీసులకు లొంగిపోయినట్లు తెలియడంతో వరంగల్‌ నగరం కాజీపేటలోని సహృదయ వృద్ధాశ్రమంలో కొన్నేళ్లుగా ఆశ్రయం పొందుతున్న జంపన్న తల్లి యశోదమ్మను శనివారం ‘సాక్షి’పలకరించింది. జంపన్న లొంగుబాటు విషయాన్ని ప్రస్తావించడంతో ఆనందభాష్పాలు రాల్చారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి వస్తాడని ఆశిస్తే ఉద్యమబాట పట్టిన నర్సన్నను చూడాలని ఎంతోకాలంగా కంటిపై రెప్ప వేయకుండా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇంత కాలానికి అడవితల్లి కరుణించి నా కొడుకును చూసే భాగ్యం కల్పించిందంటూ కనిపించిన వారికందరికీ దండాలు పెడుతున్నారు.   

మావోయిస్ట్‌ అగ్రనేత జంపన్న లొంగుబాటు

మరిన్ని వార్తలు