ముమ్మాటికీ బూటకమే.. 

1 Aug, 2019 11:26 IST|Sakshi
ఎన్‌కౌంటర్‌ జరిగిన రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలోని పందిగుట్ట ఇదే, హతమైన లింగన్న (ఫైల్‌)

సాక్షి, ఖమ్మం(ఇల్లెందు) : తూటాల మోత, ఎన్‌కౌంటర్‌ ఘటనతో మన్యం ప్రజలు ఉలిక్కిపడ్డారు. అడవిలో అలజడి అలుముకుంది. ఒక వైపు మావోయిస్టు వారోత్సవాలు, మరొక వైపు సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి లింగన్న ఎన్‌కౌంటర్‌తో గుండాల ఏజెన్సీ ఉలిక్కిపడింది. గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలోని పందిగుట్ట మీద జరిగిన ఎదురు కాల్పుల్లో గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామానికి చెందిన పూనెం లింగయ్య, అలియాస్‌ లింగన్న(50) మృతి చెందాడు. 22 ఏళ్ల క్రితం అజ్ఞాత వాసంలోకి వెళ్లిన లింగన్న 2017 డిసెంబర్‌లో వైద్యం కోసం ఖమ్మం వెళ్లి వస్తూ రఘునాథపాలెం వద్ద అరెస్టు అయ్యాడు.

జైలుకు వెళ్లి విడుదలైన అనంతరం 6 నెలల పాటు గుండాలలోని ఇంటి వద్ద ఉన్న లింగన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు మళ్లీ అటవీ బాట పట్టాడు. ఆ తర్వాత గుండాల ఎంపీపీని, జెడ్పీటీసీని కైవసం చేసుకుని ఉనికి కాపాడుకున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టులు ఏజెన్సీలోకి అడుగు పెట్టినట్లు పసిగట్టిన పోలీసులు కూంబింగ్‌ను ఉధృతం చేశారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో గ్రేహౌండ్స్‌ బలగాలను మోహరింపజేసి కూంబింగ్‌ను చేపట్టారు. ఈ క్రమంలో రోళ్లగడ్డ పందిగుట్ట మీద జరిగిన ఎన్‌కౌంటర్‌లో అంతమయ్యాడు.  

అజ్ఞాతంలోకి వెళ్లిన నేపథ్యం ఇదే.. 
1996–97లో ఎన్డీకి, పీపీజీ శంకరన్నకు మధ్య తారాస్థాయిలో యుద్ధం జరిగింది. ఈ ఘర్షణ క్రమంలో గుండాల మండలంలోని లింగగూడెం, దేవాళ్లగూడెం, రోళ్లగడ్డ వద్ద పలు దఫాలు క్రాస్‌ఫైరింగ్‌లు జరిగి ఇరు వర్గాలు దళసభ్యులను కోల్పోయాయి. ఈ క్రమంలో గుండాల మండలంలోని రోళ్లగడ్డ, దేవాళ్లగూడెం, లింగగూడెం, చీమలగూడెం, నర్సాపురం తండాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు అడవిబాట పట్టారు. అందులో లింగన్న సైతం అజ్ఞాతంలోకి వెళ్లాడు. లీగల్‌ కార్యకర్తగా పీవైఎల్‌లో పని చేసిన లింగన్న గ్రామస్థాయి నుంచి మండల స్థాయికి ఎదిగాడు.

రెండు పార్టీల మధ్య ఘర్షణలో ఇల్లీగల్‌గా మారి దళసభ్యుడు నుంచి జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు స్థాయికి ఎదిగాడు. గతేడాది క్రితం ఎన్డీ చంద్రన్న వర్గంలోకి వెళ్లిన ఆయన రెండు రోజుల తర్వాత పార్టీ, కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గి తిరిగి ఎన్డీ రాయల వర్గంలో చేరాడు. అయితే ఆనాడు అజ్ఞాతం వీడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. పోలీసులు కూడా పలు దఫాలు లింగన్నను పట్టుకునేందుకు అదును కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో వైద్యం కోసం వెళ్లిన లింగన్నను ఎస్‌ఐ గోపి రఘునాధపాలెం వద్ద వల పన్ని పట్టుకున్నారు.  

2012 నుంచి నష్టం ఆరంభం.. 
2012లో న్యూడెమోక్రసీలో చీలిక సంభవించింది. నాటి నుంచి ఆ పార్టీ కోలుకోలేనంత నష్టపోతోంది. సుధీర్ఘకాలం అజ్ఞాత జీవితంలో ఉన్న అగ్రనేతలు అరెస్టులు అవుతుండడంతో శ్రేణుల్లో అయోమయం వ్యక్తమవుతోంది. ఒకానొక దశలో ఆ పార్టీలోని దిగువ శ్రేణి నేతలు సైతం అరెస్టులను చూసి విస్తుపోతున్నారు. ఖమ్మం–వరంగల్‌ ఏరియా పరిధిలోని అజ్ఞాత ఉద్యమం ఒడిదొడుకులకు గురవుతోంది.  

కుటుంబ వివరాలు.. 
22 ఏళ్ల క్రితం అడవి బాట పట్టిన లింగన్నకు భార్య సారమ్మ, కుమారుడు హరినాథ్, కూతురు హైమావతిలు ఉన్నారు. లింగన్న అటవీ బాట పట్టిన తర్వాత 15 ఏళ్ల క్రితం గుండాల గిరిజన గురుకుల పాఠశాలలో వంట వర్కర్‌గా సారమ్మ చేరింది. నాటి నుంచి నేటి వరకు గుండాల గురుకులం వద్ద మటంలంక గ్రామంలో ఓ ఇల్లు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తోంది. సుధీర్ఘ కాలం ఉద్యమ నేతగా ఉన్న లింగన్న ప్రస్థానం ఈ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. 

కాచనపల్లి పోలీస్‌ స్టేషన్‌లో  35మంది నిర్బంధం.. 
ఎన్‌కౌంటర్‌ వార్త తెలిసిన వెంటనే సీపీఐ (ఎంఎల్‌)న్యూడెమోక్రసీ పార్టీ నాయకురాలు, జెడ్పీటీసీ చండ్ర అరుణ ఆధ్వర్యంలో 35మంది మూడు వాహనాల్లో గుండాలకు వెళ్తుండగా కాచనపల్లి వద్ద పోలీసులు అటకాయించి అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ అరెస్టు చేసిస్టేషన్‌లో నిర్బంధించారు. ఈ సంఘటనను పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

ముమ్మాటికీ బూటకమే.. 
గుండాల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ కచ్చితంగా బూటకమే. అనారోగ్యంతో బాధపడుతున్న లింగన్నను పోలీసులు పట్టుకుని హతమార్చి ఎన్‌కౌంటర్‌ కథ అల్లారు. ప్రజా ఉద్యమాల కోసం జీవితాన్ని ధారపోసిన లింగన్న సేవలు ఎనలేనివి. గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, బయ్యారం, పాఖాల కొత్తగూడెం మండలాల్లో లింగన్న ఆధ్వర్యంలో వేలాది ఎకరాల పోడు భూములు సాగు చేసుకుని ప్రజలు జీవిస్తున్నారు. అనేక ప్రజా పోరాటాల్లో లింగన్న పాత్ర ఉంది.
– మధు, ఎన్డీ రాష్ట్ర నేత, చండ్ర అరుణ, జెడ్పీటీసీ  

>
మరిన్ని వార్తలు