ఉత్తరాన ఉలికిపాటు..! 

16 Jul, 2020 02:39 IST|Sakshi

సుదీర్ఘకాలం తరువాత ఉత్తర తెలంగాణలో మావో కార్యకలాపాలు 

కోవిడ్, పోడు అంశాలతో ఆదివాసీల రిక్రూట్‌మెంట్‌కు యత్నాలు 

మావోయిస్టుల డైరీలో 15 మంది ఆసిఫాబాద్‌ యువత పేర్లు 

వారిని ఛత్తీస్‌గడ్‌కు శిక్షణ కోసం పంపారని పోలీసుల అనుమానం 

24 గంటల్లో ఆసిఫాబాద్, భద్రాద్రిలో ఎదురుకాల్పులు

సాక్షి, హైదరాబాద్‌ : ఉత్తర తెలంగాణ... మావోయిస్టు ఉద్యమానికి పుట్టినిల్లుగా చెప్పుకునే ఈ ప్రాంతంలో తిరిగి మావోల సంచారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌ మహమ్మారి విజృంభణ, మరోవైపు పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు మద్దతు వంటి అంశాలను తమ కేడర్‌ రిక్రూట్‌మెంట్‌కు అనుకూలంగా మలుచుకునే య త్నాలు చేస్తున్నారు. తాజాగా పోలీసుల కూంబింగ్‌ లో ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి పలువురు కీలక మావోయిస్టులు త్రుటిలో తప్పించుకోవడం, రెండు చోట్ల ఎదురుకాల్పులు చోటుచేసుకోవ డమే ఇందుకు నిదర్శనం.

లాక్‌డౌన్‌ సమయం నుంచే ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాల, మెట్‌పల్లి, సిరిసిల్ల, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం మొదలైంది. ఇదే సమయంలో రిక్రూట్‌మెంట్‌ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఛత్తీస్‌గడ్, ఒడిశాల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలంతా ఉత్తర తెలంగాణవారే అయినా.. వారి సొంత ప్రాంతాల్లో పార్టీ పటిష్టంగా లేదన్న వి మర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకే, ఈ విమర్శలను పోగొట్టుకునేందుకే ఈ సంక్షోభ సమయంలో ఉత్తర తెలంగాణపై దృష్టి సారించారని సమాచారం. 

ఇపుడే ఎందుకు? 
ప్రస్తుతం కోవిడ్‌ వైరస్‌ విజృంభణకు వేలాది మందికి ఉపాధి కరువైంది. ముఖ్యంగా అసంఘటి త రంగంలో ఉండే కార్మికులు,   విద్యావంతులు సైతం ఉపాధి కోల్పోతున్నారు. దేశంలో ప్రస్తు తం నెలకొన్న ఆర్థిక మందగ మనం కారణంగా క్రమంగా నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయి. అంటే తిరిగి 1990ల నాటి పరిస్థితులు కనిపిస్తున్నా యి. అందుకే, కేడర్‌ రిక్రూట్‌మెంట్‌ ఇదే సరైన సమయమని భావించిన మావో అగ్రనేతలు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్‌లపై దృష్టి కేంద్రీకరించారు. ప్రజాసమస్యలపై పోరాటం పేరిట గిరిజన, అటవీ ప్రాంతాల ఆదివాసీల్లోని అనాథలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతను తమతో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.

ఇప్పటికే మావోయిస్టు పార్టీ కోసం పలు ప్రాంతాల్లో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో ఇటీవల సిరిసిల్లలో పోలీ సులు కొందరు మావోయిస్టులను, కొన్ని తుపాకులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.  రెండో ప్రధాన కారణం పోడు వ్యవసాయం... ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోడు వ్యవసాయం పోకడలు అధికం. దాంతో ఇక్కడ ఫా రెస్టు ఆఫీసర్లకు పోడు వ్యవసా యం చేసుకునేవారికి ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా తిప్పుకోవాలని మావో నేతలు నిర్ణ యించినట్లు కనిపిస్తోంది. పోడు రైతుల్లో యువకులను తమవైపు తీసుకెళ్లేందుకు పలు రకాల వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. 

ఆ 15 మంది ఎక్కడ? 
ఆసిఫాబాద్‌లో తిర్యాణి మండలంలో మైలరేపు అడెళ్లు అలియాస్‌ భాస్కర్‌  నేతృత్వంలోని వీరి స్థావరం నుంచి ఆసిఫాబాద్‌ పోలీసులు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆసిఫాబాద్‌కు చెందిన 15 మంది యువకుల పేర్లు ఉన్నాయి. వీరిలో చాలామంది స్థానికంగా లేరని, మిస్సయ్యారని సమాచారం. వీరు ఎక్కడికెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి పేర్లు డైరీ లో ఎందుకున్నాయి? వీరిని ఇప్ప టికే రిక్రూట్‌ చేసుకున్నారా? శిక్షణ కోసం ఛత్తీస్‌గడ్‌ పంపారా? లేక మరేదైనా కారణం కోసం డైరీలో రాసుకున్నారా? అన్న అంశాలను ధ్రువీకరించుకునే పనిలో పడ్డారు. 

24 గంటల్లో రెండు చోట్ల ఎదురుకాల్పులు.. 
రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు మావోయిస్టులకు మధ్య రెండు చోట్ల ఎదురుకాల్పులు జరగడం తెలంగాణ ఏర్పడ్డాక ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈవారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండల పరిధిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ నేతృత్వంలోని దళం సంచరిస్తోందన్న సమాచారంతో స్పెషల్‌ పోలీసులు రంగంలోకి దిగారు. అతనితోపాటు బండి ప్రకాశ్‌ అలియాస్‌ ప్రభాత్, ఛత్తీస్‌గడ్‌కు చెందిన వర్గీస్‌ కోయ మగ్లు, కంతి లింగవ్వ అలియాస్‌ అనిత, పాండు అలియాస్‌ మంగులు, మీనా, రాములతో కూడిన దళం పోలీసులకు ఎదురుపడగా ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ఇందులో భాస్కర్, ప్రభాత్‌ తలలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా మిగిలిన దళ సభ్యులపై రూ.4 నుంచి 5 లక్షల రివార్డు ఉంది. వీరి ఫొటోలను ఇప్పటికే విడుదల చేసిన పోలీసులు..తిర్యాణి అడవుల్లో జల్లెడ పడుతున్నారు. మరోవైపు కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలోని మల్లెపల్లితోగు సమీపంలో కూంబింగ్‌ చేస్తోన్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.  కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. సామగ్రి వదిలేసిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు