బాల నాయకుడుగా వెళ్లి.. బడానేతగా ఎదిగి

14 Dec, 2019 02:57 IST|Sakshi

ముగిసిన మవోయిస్టు నేత రామన్న ప్రస్థానం

అనారోగ్యంతో కన్నుమూసినట్టు ప్రకటించిన పార్టీ

సాక్షి, సిద్దిపేట/ మద్దూరు: మావోయిస్టు పార్టీకి గుండెకాయలాంటి దండకారణ్యంలో పార్టీ విస్తరణలో కీలక భూమిక పోషించిన రామన్న అలియాస్‌ రావుల శ్రీనివాస్‌ అనారోగ్యంతో ఆదివాసీల మధ్య కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బెక్కల్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ నాలుగు దశాబ్దాల క్రితం పదిహేనేళ్ల వయసులోనే ప్రజలకోసం ఆడవి బాటపట్టారు. దూల్మిట్టలో ఏడవ తరగతి చదువుతున్న సమయంలో ఆర్‌ఎస్‌యూ (రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌) భావాలకు ఆకర్షితుడయ్యారు.

ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో సాధారణ దళ సభ్యునిగా చేరారు. అప్పట్లో ఆయన వయసు 15 సంవత్సరాలే. పార్టీ నిర్మాణంలో చురుగ్గా పాల్గొని ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్‌.. ఇలా ఐదు రాష్ట్రాల్లో రామన్న కీలక నాయకుడిగా ఎదిగారు. 2010లో జరిగిన మవోయిస్టు పార్టీ సమావేశాల్లో రామన్నను కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించారు.  ఆయన తలపై వివిధ రాష్ట్రాలు రూ.1.5 కోట్ల రివార్డు ప్రకటించాయి.

బీపీ షుగర్‌లతోనే..
తీవ్రమైన బీపీ, షుగర్‌ సమస్యలతో రామన్న తరచుగా ఆనారోగ్యానికి గురయ్యేవారు.  రామన్న ఈనెల 10వ తేదీన అనారోగ్యంతో దండకారణ్యంలో కన్నుమూసినట్లు ఆ పార్టీ ప్రతినిధి వికల్ప్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు