కొడుకా.. ఎట్ల బతుకుతవురా..

26 Dec, 2017 12:10 IST|Sakshi

జంపన్నను చూడగానే ఉద్వేగానికి గురైన తల్లి

కన్నీళ్లు పెట్టుకున్న తల్లీకుమారులు 

తల్లికి గోరుముద్దలు తినిపించిన జంపన్న 

సాక్షి, కాజీపేట: పుట్టి పెరిగిన ఊర్లో ఇల్లు కూలిపోయే.. భూములు లేవయే ఏట్లా బతుకువుతారా కొడుకా అంటూ జంపన్న తల్లి యశోదమ్మ ఉద్వేగానికి లోనవుతూ ప్రశ్నించడం చూపరుల హృదయాలను కలచివేసింది. మావోయిస్టు అగ్రనేతగా పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిన జినుగు నర్సింహరెడ్డి అలియాస్‌ జంపన్న సోమవారం రాత్రి సహృదయ ఆశ్రమంలో ఉంటున్న తల్లి యశోదమ్మను భార్య రజితతో కలిసి వచ్చి పరామర్శించారు. మూడున్నర దశాబ్దాల కాలం తర్వాత కళ్ల ముందు కనిపించిన కుమారుడిని చూసిన యశోదమ్మ తల్లడిల్లిపోయింది. చివరి చూపునకు నోచుకుంటానో లేదోనని నిత్యం మదనపడ్తుండేదాన్నని ఇంత కాలానికైనా నా దగ్గరికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ప్రేమపూర్వకంగా కుమారుడిని దగ్గరకు తీసుకుని ముద్దాడింది. ప్రజల కోసమంటూ మళ్లీ ఎక్కడికి వెళ్లొద్దని, భార్యతో హాయిగా ఉండుమంటూ కన్నీళ్ల పర్యంతమవుతూ దీవించింది. 

ఆశ్రమంలోనే ఉంటా.. ఎక్కడికి రాను..
ఇక నుంచి నీతోనే ఉంటాను రమ్మని తల్లిని కోరగా నాలుగేండ్లుగా ఆశ్రయం కల్పించిన సహృదయను వదిలి ఎక్కడికీ రానని తనకు మొదటి నుంచి సీతక్క, అలీ సాయం చేస్తున్నట్లుగా చెప్పింది. తన ప్రాణం ఆశ్రమంలోనే పోవాలని ఇంత కాలానికి బయటకు వచ్చిన మీకు భారంగా మారడం ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పింది. తల్లీకుమారుడు ఒకరికొకరు గోరుముద్దలు తిన్పించుకుంటూ భోజనం చేస్తుండడం చూసి  ఆశ్రమంలో ఉన్న వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు.  

తల్లీకొడుకుల బంధుత్వం విలువ కట్టలేనిది..
అనంతరం జంపన్న విలేకరులతో మాట్లాడుతూ మా అమ్మకు ఆశ్రయం కల్పించి చక్కగా చూసుకుంటున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తల్లీబిడ్డల ప్రేమ, అప్యాయతకు విలువ కట్టలేనిదని, ఉద్యమంలో ఉన్నపుడు మా అమ్మ ఇచ్చే ప్రకటనలు చూసినప్పుడు బాధ అన్పించినా.. ఎంతో మంది తల్లులు పిల్లలకు దూరమై భారంగా బతుకుతున్నారని వారి ఆవేదన, ప్రజల కష్టాలను తీర్చడం కోసమే ఉద్యమబాట పట్టినట్లు చెప్పారు. తల్లిని చూసుకోవడానికి తరచు వచ్చిపోతుంటానని తెలిపారు.

కొడుకును చూడటం ఆనందంగా ఉంది..
బతికి ఉండగా జంపన్నను చూస్తాననుకోలేదని, భగవంతుడు నా ప్రార్థనను ఆలకించడం సంతోషంగా ఉందని చెప్పింది. తల్లి కోరిక ప్రకారమే సోమవారం రాత్రి ఆగమేఘాల మీద జంపన్న సహృదయ ఆశ్రమాన్ని సందర్శించినట్లు బంధువులు ‘సాక్షి’కి తెలిపారు. సోమవారం మంచి రోజు కాబట్టి వెంటనే రావాలని లేకపోతే రెండు, మూడు రోజులు ఆగాలని చెప్పడంతో తల్లి కోరిక మేరకు వరంగల్‌కు వచ్చినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు