ఆగస్టు 15న బ్లాక్‌డేగా పాటించాలి

13 Aug, 2019 11:45 IST|Sakshi
మావోయిస్టు పార్టీ లేఖ  

కశ్మీర్‌ ప్రజలకు అండగా నిలవాలి  

సీపీఐ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు 

సాక్షి, చర్ల : కశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి అధికారాలైన ఆర్టికల్‌ 370, 35ఏ లను రద్దు చేయడాన్ని, కశ్మీర్‌ రాష్ట్రాన్ని విభజించడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని, అక్కడి ప్రజలకు మద్దతుగా పోరాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధి కార ప్రతినిధి జగన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పత్రికలకు ఒక లేఖను విడుదల చేశా రు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న బ్లాక్‌డేగా పాటించాలని కోరారు. జమ్మూ కశ్మీర్‌లో తీవ్ర నిర్బంధం విధించిన తర్వాతే బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లులను రాజ్యసభ, లోక్‌సభలలో ప్రవేశ పెట్టిందని ఆరోపించారు. సంఘ్‌ పరివార్, బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదుల బీజేపీ ప్రభుత్వం తమ పథకంలో భాగంగానే కేంద్ర హోమంత్రి అమిత్‌షా నాయకత్వంలో జమ్మూ కశ్మీర్‌లో సైన్యాన్ని మోహరించారని అన్నారు.

శాంతి భద్రతల పేరుతో బీజేపీ ప్రభుత్వం ఇంటర్‌నెట్లను, ఎలక్టానిక్‌ మీడియాలను బంద్‌ చేయించిందని, పచ్చి బ్రాహ్మణీయ మతోన్మాది గవర్నర్‌ సత్యపాల్‌ కశ్మీర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశం బహు ళ జాతులు, బహుళ బాషలు, అనేక సంస్కృతులు గల దేశమని, ఈ జాతులను అభివృద్ధి చెందకుండా భారత దళారీ పాలక వర్గాలు, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తూ, జాతులను దోపిడీ చేస్తూ ఐక్యత, సమగ్రత పేరుతో దేశాన్ని జాతుల బందీఖానాగా మార్చివేశారని పేర్కొన్నారు. తమ పార్టీ జాతుల న్యాయమైన పోరాటాన్ని సమర్థిస్తున్నదని, విడిపోయే హక్కు ను గుర్తిస్తున్నదని, స్వయం ప్రతిపత్తి కోసం న్యాయమైన పోరాటం కొనసాగిస్తున్న కశ్మీర్‌ ప్రజలకు మావోయిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. 370, 35ఏల రద్దుపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు, పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబురాలు జరుపుకోవడాన్ని వ్యతిరేకించాలని కోరారు.

మరిన్ని వార్తలు