25న రాష్ట్ర బంద్‌కు మావోల పిలుపు

22 Jul, 2020 01:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ప్రజాకవి, విరసం నేత వరవరరావు అక్రమ నిర్బంధానికి నిరసనగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ప్రజలు బంద్‌ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట లేఖ విడుదల చేసింది. అర్బన్‌ నక్సల్స్‌ పేరుతో అరెస్టు చేసిన వరవరరావు, ప్రొఫెసర్‌ సాయిబాబాతో సహా 12 మందిని, 60 ఏళ్లు పైబడిన రాజకీయ ఖైదీలను ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ ఉపా, ఎన్‌ఐఏ కేసులను ఎత్తేయడంతోపాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్‌ దళాలను వెంటనే వెనక్కి పిలవాలని లేఖలో డిమాండ్‌ చేశారు. కాగా, తెలంగాణలో కార్యకలా పాలు ఉధృతం చేసేందుకు రాష్ట్ర కమిటీతోపాటు 12 ఏరియా కమిటీలను మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆసిఫాబాద్‌లో దాదాపు 15 మంది యువతను దళంలో చేర్చుకున్నారని, ఆదివాసీలు ఉన్న అన్నిప్రాంతాల్లోనూ రిక్రూట్‌మెంట్‌ జరిగి నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు మావోయిస్టు పార్టీ వేసిన కమిటీలు, వారి వివరాలు.. 

రాష్ట్ర కమిటీ సభ్యులు
మొత్తం ఏడుగురు సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్‌ అలియాస్‌ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. పుల్లూరి ప్రసాద్, బండి ప్రకాశ్, దామోదర్, భాస్కర్, సాంబయ్య, కంకణాల రాజిరెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు పర్యవేక్షణలో రాష్ట్ర కమిటీ పనిచేస్తుందని, దీని ఆధీనంలో 12 ఏరియా కమిటీలు పనిచేస్తాయని తెలిసింది.

ఏరియా కమిటీలు
1. కంకణాల రాజిరెడ్డి నేతృత్వంలో జయశంకర్‌ జిల్లా మహబూబాబాద్‌ జిల్లా, వరంగల్‌– పెద్దపల్లి ఏరియా కమిటీ. 2. రీనా అలియాస్‌ సమే– ఏటూరునాగారం– మహదేవ్‌పూర్‌ ఏరియా కమిటీ. 3. ఉంగి– వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ. 4. మంగు నేతృత్వంలో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ. 5. అడెల్లు భాస్కర్‌ సారథ్యంలో మంచిర్యాల కొమ్రంభీం జిల్లా కమిటీ. 6. లింగమ్మ– మంగీ ఏరియా కమిటీ. 7.వర్గేష్‌ – ఇంద్రవెల్లి ఏరియా కమిటీ, 8. నరసింహారావు– చెన్నూరు–సిర్పూర్‌ ఏరియా కమిటీ. 9. సమ్మక్క అలియాస్‌ శారద– చర్ల శబరి ఏరియా కమిటీ. 10. రమాల్‌– మణుగూరు ఏరియా కమిటీ. 11.సాంబయ్య – భద్రాద్రి కొత్తగూడెం– ఈస్ట్‌ గోదావరి డివిజనల్‌ కమిటీ. 12. బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌– తెలంగాణ యాక్షన్‌ కమిటీ.

మరిన్ని వార్తలు