నింగివైపు మావోల చూపు

12 Jan, 2015 08:58 IST|Sakshi
నింగివైపు మావోల చూపు

చింతూరు :ఆంధ్ర, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో విస్తరించిన దండకారణ్యంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్ ప్రాంతాల్లో గగనతల దాడులు ఎలా నిర్వహించాలనే దానిపై మావోయిస్టులు ముమ్మరంగా శిక్షణ ఇస్తున్నట్లు పోలీసు వర్గాలు పసిగట్టాయి. ఇటీవల దండకారణ్య పరిధిలోని గూటుం అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీసులకు లభించిన సాక్ష్యాలు మావోయిస్టుల శిక్షణను ధ్రువీకరిస్తున్నాయి.

ఎదురుకాల్పుల సందర్భంగా మావోయిస్టుల శిక్షణకు సంబంధించిన వీడియో సీడీతో పాటు ఓ మ్యాప్ కూడా లభించింది. ఎయిర్ డిఫెన్స్ యుద్ధతంత్రంలో భాగంగా మావోయిస్టులు తమ సహచరులకు హెలికాప్టర్‌లపై ఎలా దాడి చేయాలనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఇందులో తేలింది. హెలికాప్టర్లపై దాడులు చేయడంతో పాటు గగనతల దాడుల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై మావోయిస్టుల శిక్షణ ఇస్తున్నారు.
 
దీనికోసం ఓ డమ్మీ హెలికాప్టర్‌ను తయారు చేసిన మావోయిస్టులు ఆకాశంలో ఎగురుతున్న దానిని నేలపై పడుకుని ఎలా దాడి చేయాలనే అంశంపై శిక్షణ ఇస్తున్నట్లు సీడీలో స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది యువతకు బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఈ శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టులు గగనతల దాడులకు పాల్పడితే అటవీ ప్రాంతాల్లో హెలికాప్టర్‌ల రాకపోకలు ఎలా అనే దానిపై ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాల్లో ఆందోళన నెలకొంది.

కూంబింగ్ సమయాల్లో, ఎన్‌కౌంటర్లు జరిగినపుడు గాయపడిన జవాన్లను త్వరితగతిన ఆసుపత్రులకు చేర్చేందుకు హెలికాప్టర్ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లడం తప్పనిసరి కావడంతో ప్రస్తుత మావోయిస్టుల గగనతల దాడుల శిక్షణ పోలీసులను మరింత కలవరపెడుతోంది. గగనతలంలోనే వాటిపై దాడులు చేసేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నట్లు పోలీసులకు లభించిన సీడీల ద్వారా స్పష్టమవుతోంది. రేషన్ తీసుకెళ్లడంతో పాటు జవాన్లను దీనిద్వారానే అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నారు. హెలికాప్టర్ల వినియోగంతో మందుపాతర్ల వలన కలిగే నష్టాలన తగ్గించడంతో పాటు వీఐపీలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లగలుగుతున్నారు.
 
గతంలో కూడా హెలికాప్టర్లపై దాడులు..
కాగా మావోయిస్టులు గతంలో కూడా హెలికాప్టర్లపై దాడి చేసిన ఘటనలున్నాయి. 2008లో బీజాపూర్ జిల్లాలో ఎన్నికల సమయంలో హెలికాప్టర్‌పై మావోయిస్టులు జరిపిన దాడిలో సార్జెంట్ మృతిచెందాడు. 2013-2014లో సుక్మా జిల్లాలోని చింతల్‌నార్, చింతగుహ, ఎల్మగూడ అటవీప్రాంతాల్లో సైతం మావోయిస్టులు హెలికాప్టర్లపై కాల్పులు జరిపారు. చింతగుహ వద్ద జరిపిన దాడిలో వాయుసేనకు చెందిన ఎంఐ17 హెలికాప్టర్‌కు బుల్లెట్లు తగలడంతో అటవీ ప్రాంతంలోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేసి, రెండు రోజులు అక్కడే ఉంచి, మరమ్మతుల అనంతరం తిరిగి తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు