ఈ మల్లన్న.. ఎవరన్నా?

29 Dec, 2018 02:20 IST|Sakshi

సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో నక్సలైట్‌ పేరిట దందా..

గన్‌తో బెదిరించి మరీ దండుకుంటున్న వైనం..

ఫిర్యాదు చేసేందుకు వెనుకాడిన ఓ ప్రభుత్వాధికారి 

ఆ మరుసటి రోజే కాంట్రాక్టర్‌కు బెదిరింపులు 

నకిలీ నోట్ల నిందితుడి నేతృత్వంలో దళం ఏర్పాటు? 

జాతీయ పార్టీ నేతతో దళం ఇన్‌చార్జి చెట్టపట్టాలు

సాక్షి, హైదరాబాద్‌: అది రాజీవ్‌ రహదారి. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే ప్రధాన మార్గం. సిద్దిపేట జిల్లాకు అత్యంత దగ్గరగా ఉన్న ఓ మండల అధికారి కారులో తన ఆఫీస్‌ నుంచి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లగానే నలుగురు వ్యక్తులు కారు ఆపారు. లిఫ్ట్‌ కావాలని కారెక్కారు. వారిలో ఓ వ్యక్తి.. మల్లన్న మిమ్మల్ని తీసుకురమ్మన్నాడని చెప్పాడు. దీంతో మల్లన్న ఎవరు.. ఎక్కడుంటాడు.. అసలు ఆయనెవరో చెప్పాలని ఆ అధికారి పేర్కొన్నారు. అవన్నీ తర్వాత చెప్తామని, ముందు తాము చెప్పినట్లు వెళ్లాలని గట్టిగా చెప్పారు. ఓ 20 కిలోమీటర్లు వెళ్లగానే ఓ వ్యక్తికి ఫోన్‌ వచ్చింది.  మల్లన్న బిజీగా ఉన్నాడు.. ఆ కారు దిగి వచ్చేయండి అని ఫోన్‌లో వ్యక్తి చెప్పడంతో కారు దిగి వెళ్లిపోయారు. ఇదంతా మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. ఇప్పటికీ ఆ అధికారి షాక్‌లోనే ఉన్నాడు. అక్కడి నుంచి ఆఫీస్‌కు వెళ్లిపోయాడు. 

సాయంత్రం సినిమా చూపించారు.. 
సాయంత్రం 5 గంటలు కావస్తోంది. విధులు ముగించుకొని సంబంధిత అధికారి కారులో ఇంటికి చేరుకున్నాడు. అక్కడే అధికారికి షాక్‌ తగిలింది. తనతో మధ్యాహ్నం మల్లన్న విషయం చెప్పిన నలుగురు ఆ అధికారి ఇంటి వద్ద ఉన్నారు. వారిలో ఒకరు గేటు వద్ద కాపలా ఉండగా, మిగిలిన వారు అధికారి ఇంట్లో కూర్చున్నారు. అధికారి ఇంట్లోకి వెళ్లగానే ‘మల్లన్న రూ.10 లక్షలు ఇవ్వమన్నాడు. త్వరగా డబ్బులిస్తే వెళ్లిపోతాం’అని సంబంధిత వ్యక్తులన్నారు. ‘అసలు మల్లన్న ఎవరు? నేనెందుకు డబ్బులివ్వాలి? ఎవరు మీరు అని’ అధికారి ఎదురు ప్రశ్నించాడు.

దీంతో వారు అధికారి తలపై గన్‌ పెట్టి డబ్బులు ఇవ్వకపోతే అధికారితో పాటు ఆయన భార్యను కూడా చంపేస్తామని బెదిరించారు. తమది మల్లన్న మిలిటెంట్‌ దళం అని, డబ్బులివ్వకపోతే ప్రాణాలు పోతాయని బెదిరించడంతో అంత డబ్బు లేదని, రూ.50 వేలు ఉన్నాయని అధికారి చెప్పారు. ఆ డబ్బు తీసుకుని మిగిలిన మొత్తంపై అన్నతో మాట్లాడి చెప్తామని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అధికారి ఎక్కడా చెప్పలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు.. చేస్తే ఎక్కడ తన కుటుంబాన్ని టార్గెట్‌ చేసి చంపుతారేమోనని భయపడ్డారు. 

తెల్లారే కాంట్రాక్టర్‌ను.. 
ఆ మరుసటి రోజే మెదక్‌ జిల్లాలో రోడ్ల నిర్మాణం చేస్తున్న ఓ బడా కాంట్రాక్టర్‌కు మల్లన్న మిలిటెంట్‌ దళం అంటూ ఫోన్‌ చేసి బెదిరించారు. రేపు వస్తామని, రూ.10 లక్షలు రెడీ చేసుకోవాలని, లేకపోతే చంపేస్తామంటూ హెచ్చరించారు. సదరు వ్యక్తుల నంబర్లను తెలిసిన పోలీస్‌ అధి కారి ద్వారా కాంట్రా క్టర్‌ ఆరా తీయించాడు. దీంతో ఈ వ్యక్తులతో పాటు ఓ మండల ఎంపీపీ, అతడి అనుచరుడిగా ఉన్న ఓ ఎంపీటీసీ భర్త నంబర్లు ఉండటం సంచలనం రేపుతోంది. టీఆర్‌ఎస్‌లో ఉన్న ఈ ఎంపీపీకి, ఎంపీటీసీ భర్తకు, మల్లన్న మిలిటెంట్‌ గ్యాంగ్‌కు సంబంధం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. 

అతడి నేతృత్వంలోనే దళం.. 
ప్రస్తుతం సిద్దిపేట, మెదక్‌ ఈ రెండు జిల్లాల్లో మావోయిస్టు ప్రాబల్యమే లేదు. పాత జనశక్తి దళాల్లో ఉన్న ఎవరూ కూడా యాక్టివ్‌ లో లేరు. అలాంటప్పుడు ఈ దళం ఎక్కడినుంచి వచ్చిందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎంపీపీకి గతంలో నకిలీ నోట్ల చెలామణి చేసిన వ్యక్తి, పోలీసులపై కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చిన నిందితుడికి సంబంధం ఉండటం అనుమానాలకు తావిస్తోంది. శామీర్‌పేట పరిసరాల్లో నకిలీ నోట్లు చెలామణి చేస్తూ దొరికినప్పుడు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తే ఈ దళానికి నాయకత్వం వహిస్తున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి.

పోలీసుల నిఘా వైఫల్యం.. 
సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో తుపాకులతో సంచరిస్తూ దళాల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నా అక్కడి పోలీసులకు ఈ విషయం తెలియకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో నయీం లాంటి వ్యక్తి దళాల పేరుతో సంచరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బెదిరింపులకు గురైన కాంట్రాక్టర్‌ నేరుగా డీజీపీ లేదా ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులను కలసి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల పోలీసులపై నమ్మకం లేదన్న ఉద్దేశంతోనే ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. పైగా ఆ దళం ఇన్‌చార్జి ఓ జాతీయ పార్టీ నేతతో తిరుగుతుండటం సంచలనం రేపుతోంది. గతంలో ఇద్దరు పోలీసులను తుపాకీతో హతమార్చిన వ్యవహారంలోనూ ఇదే నేత సహాయం చేసి బయటపడేలా చేసినట్లు ఆరోపణలున్నాయి. 

మరిన్ని వార్తలు