చదువులమ్మ ఒడిలో ‘మావో’ల కలకలం!

15 May, 2019 05:34 IST|Sakshi

శాతవాహన యూనివర్సిటీలో కొత్త వివాదం 

తెలంగాణ విద్యార్థి వేదికకు తీవ్రవాదులతో లింక్‌పై వాట్సాప్‌ పోస్టు 

‘స్టడీ టూర్ల’పేరుతో ప్రొఫెసర్‌ సుజాత ఛత్తీస్‌గఢ్‌ వెళ్లినట్లు ఆరోపణ 

నక్సలైట్‌ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం పేరిట వాట్సాప్‌ లేఖ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో మావోయిస్టు కార్యక్రమాల పేరిట సామాజిక మాధ్యమాల్లో సాగిన ప్రచారం వివాదాస్పదమవుతోంది. ‘నక్సలైట్‌ కార్యకలాపాలపై శాతవాహన యూనివర్సిటీలో పోలీసుల ఆరా’శీర్షికన రాసిన లేఖ సోమవారం ఉదయం నుంచి వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ అయింది. ‘నక్సలైట్‌ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం, కరీంనగర్‌’పేరిట ఈ లేఖ వాట్సాప్‌ గ్రూపుల్లో మీడియాతో పాటు విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్ల ఫోన్లలో చక్కర్లు కొట్టింది. అయితే మీడియా గ్రూపులకు స్వయంగా పోలీసుశాఖ పంపించడం గమనార్హం.

దీంతో పోలీస్‌ శాఖ తరఫున అధికారికంగా నక్సలైట్‌ బాధితులు లేఖ విడుదల చేసినట్లు భావించారు. దీనిపై పోలీసు శాఖ అధికారులను ‘సాక్షి’సంప్రదించగా, యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో వచ్చిన పోస్టును సమాచారం కోసం షేర్‌ చేశామే తప్ప, అధికారికంగా కాదని వెల్లడించారు. కాగా సాయంత్రం ఇదే సంఘం తరఫున వచ్చిన మరో పోస్టును గ్రూపులో కాకుండా విడిగా జర్నలిస్టులకు పోస్టు చేశారు. తెలంగాణ విద్యార్థి వేదికకు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేందుకు సాక్ష్యాలుగా టీవీవీ అనుకూల విద్యార్థులు ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావుల అరెస్టును వ్యతిరేకిస్తూ నల్ల జెండాలు ప్రదర్శించిన ఫొటోను, విడుదల చేసిన పోస్టర్‌ను పంపించారు.  

టీవీవీ, ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా పోస్టు 
నిషేధిత మావోయిస్టు తీవ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) సంఘంలో సభ్యత్వాలు నమోదవుతున్నాయని ఆ పోస్టులో పేర్కొన్నారు. కొరివి సూర్యుడు, కరికె మహేశ్, దొగ్గల రాజు అనే టీవీవీ నాయకులు మరికొందరితో కలసి ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ వెళ్లి మావోయిస్టు చంద్రన్నను కలసి తీవ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చారని ఆరోపించారు. ఇక్కడ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న సూరేపల్లి సుజాత స్టడీటూర్ల పేరుతో విద్యార్థులను ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రవాదులను కలిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయిస్తున్నట్లు ఆరోపించారు. తీవ్రవాద సంస్థలకు అనుకూలంగా పనిచేసే విద్యార్థి సంఘాల్లో చేరకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ వాట్సాప్‌ లేఖను పోలీస్‌ శాఖ మీడియా గ్రూపుల్లో పంపించింది. 

నక్సలైట్లకు వ్యతిరేకంగా ఏబీవీపీ ధర్నా 
యూనివర్సిటీలో మావోయిస్టు అనుకూల విద్యార్థి సంఘం కార్యకలాపాలు సాగిస్తుందని ఓ వైపు మీడియా, పోలీసు, ప్రొఫెసర్, విద్యార్థుల గ్రూపుల్లో వీడియో వైరల్‌ అవుతున్న సమయంలో మధ్యాహ్నం ఏబీవీపీ విద్యార్థి సంఘం స్పందించింది. యూనివర్సిటీ పరిపాలన విభాగంలోకి వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ విద్యార్థి వేదికకు, నక్సలైట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రిజిస్ట్రార్‌ చాంబర్‌ ముందు బైఠాయించారు. రిజిస్ట్రార్‌ ఉమేష్‌ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చి వెళ్లారు.  

తీవ్రవాద కార్యకలాపాలు లేవు
యూనివర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై రిజిస్ట్రార్‌ ఉమేష్‌ కుమార్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ వర్సిటీలో ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాలు సాగడం లేదని స్పష్టం చేశారు. ఒకటి రెండు విద్యార్థి సంఘాల తీరులోనే తెలంగాణ విద్యార్థి వేదిక అనేది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అది నిషేధిత సంఘమో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం స్టడీ టూర్‌ కింద యూనివర్సిటీ నుంచి అధికారికంగానే భద్రాచలం వెళ్లినట్లు తెలిపా రు. ప్రొఫెసర్‌ సూరెపల్లి సుజాతతోపాటు ఇతర స్టాఫ్‌ కూడా ఉందని, తనకు భద్రాచలం అనే చెప్పారని, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లారో లేదో తెలియదని అన్నారు. పెంచల శ్రీనివాస్‌ అనే కాంట్రాక్టు లెక్చరర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలపై కమిటీ నివేదిక ఇచ్చారని, వీసీ పరిధిలో ఉందని చెప్పారు. వాట్సాప్‌ పోస్టులో ఉన్నవన్నీ తప్పులేనని అంగీకరించారు. 

టీవీవీ మావోయిస్టు అనుబంధ సంస్థే: మరో ప్రకటన 
సోమవారం ఉదయమే తెలంగాణ విద్యార్థి వేదిక లక్ష్యంగా కరీంనగర్‌ నక్సలైట్‌ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం పేరుతో వాట్సాప్‌ పోస్టు రాగా, మధ్యాహ్నం మూడు గంటలకు మరో ప్రకటన వెలువడింది. టీవీవీ మావోయిస్టు అనుబంధ సంస్థ అని చెప్పడానికి ఆధారాలు ఇవి కావా? అంటూ కొన్ని సాక్ష్యాలను విడుదల చేశారు. ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబా, వరవరరావుల అరెస్టుకు నిరసనగా తెలంగాణ విద్యార్థి వేదిక తరఫున మే 17న ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను, శాతవాహన యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శిస్తున్న ఫొటోలను విడుదల చేశారు. వీటిని కూడా పోలీస్‌ పీఆర్‌ఓ జర్నలిస్టులకు తన ఫోన్‌ ద్వారా పంపించడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా