గంటలో మూడు ఘటనలు!

28 Jan, 2018 02:35 IST|Sakshi
భూపతిరావుపేటలో దగ్ధమవుతున్న లారీలు

ఏజెన్సీలో మావోయిస్టుల బీభత్సం

శుక్రవారం రాత్రి 10–11 గంటల మధ్య..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఒకరి హత్య, మరొకరిపై కాల్పులు  

3 పొక్లెయిన్లు, 4 లారీలు, ఒక ట్రాక్టర్‌ దహనం

పినపాక: ఏజెన్సీలో మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి గంటలో మూడు ఘటనలకు పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట పంచాయతీ పరిధిలో రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో ఇన్‌ఫార్మర్ల నెపంతో ఒకరిని కొట్టి చంపారు. మరొకరిపై కాల్పులు జరిపారు. 8 వాహనాలను తగులబెట్టారు. సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మూడు గ్రామాల్లో ఒకే సమయంలో దాడులకు పాల్పడటంతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  

గోదావరి దాటి మూడు టీంలుగా...
సుమారు 50 మంది సాయుధులైన మావోయిస్టులు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం సుబ్లేడు నుంచి గోదావరి(మోకాలి లోతులో నీరు ఉంది) దాటి పినపాక మండలం భూపతిరావుపేట సమీపంలోని ఇసుక క్వారీ వద్దకు చేరుకున్నారు. సుమారు 40 మంది మావోయిస్టులు అక్కడే ఉండగా, మరో పది మంది రెండు టీంలుగా విడిపోయి సుందరయ్యనగర్, ఉమేష్‌చంద్రనగర్‌ వైపు వెళ్లారు.  

బరిసెతో పొడిచి..  
ఉమేష్‌చంద్రనగర్‌(వలస ఆదివాసీ గ్రామం)కు ఐదుగురు మావోయిస్టులతో కూడిన యాక్షన్‌ టీం చేరుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న పొడియం జోగయ్య(38)ను బయటకు తీసుకొచ్చి గ్రామస్తులు చూస్తుండగానే బరిసెతో గొంతుపై పొడిచి.. తలపై తీవ్రంగా కొట్టి చంపివేశారు. జోగయ్య పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని, 2016, మార్చి 1న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బొట్టెం వద్ద జరిగిన 9 మంది ఎన్‌కౌంటర్‌కు ప్రధాన కారకుడని, అందుకే హతమారుస్తున్నట్లు మావోయిస్టులు అక్కడ వదిలిన లేఖలో పేర్కొన్నారు.

పొడియం జోగయ్య అలియాస్‌ రాము ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పామేడు మండలం ఎర్రంపల్లి గ్రామస్తుడు. బీజాపూర్, సుకుమా జిల్లాల్లో జనతన సర్కార్‌గా పనిచేస్తున్న జోగయ్య తర్వాత ఇన్‌ఫార్మర్‌గా మారి, దళాల సమాచారం పోలీసులకు చేరవేస్తున్నాడని, అతను ఇచ్చిన సమాచారంతోనే బొట్టెం వద్ద గ్రేహౌండ్స్‌ దళాలు ఎన్‌కౌంటర్‌ చేశాయని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.  

చనిపోయాడనుకొని..  
ఐదుగురితో కూడిన మరో యాక్షన్‌ టీం సుందరయ్యనగర్‌లోని మడివి రమేశ్‌ ఇంటిని చుట్టుముట్టింది. అతడిని రోడ్డుపైకి లాక్కొచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. చనిపోయాడనుకుని వెళ్లిపోయారు. రమేశ్‌ తీవ్ర గాయాలతో జానంపేటకు చేరుకుని బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు పినపాక పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

మడివి రమేశ్‌ పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని, అందుకే అతనిని హతమారుస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. మడివి రమేష్‌పై పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో మావోయిస్టులు దాడికి పాల్పడటం ఇది నాలుగోసారి. ఇతను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వలసవచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సీపీఎం మండల కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.  

వాహనాల దహనం
గోదావరి ఒడ్డున ఇసుక డంపింగ్‌ పాయింట్‌ వద్ద పొక్లెయిన్లు, లారీలు, ట్రాక్టర్ల డ్రైవర్లు, కూలీలు సుమారు 50 మంది ఉండగా, వారిని బెదిరించి సెల్‌ఫోన్‌లు లాక్కున్నారు. మోకాళ్లపై కూర్చొపెట్టారు. తాము చెప్పింది చేయకపోతే కాల్చివేస్తామంటూ తుపాకులతో బెదిరించారు. వెంట తెచ్చుకున్న క్యాన్లలో ఉన్న పెట్రోల్‌ను వాహనాలపై పోసి నిప్పంటించారు. మూడు పొక్లెయిన్లు, నాలుగు లారీలు, ఒక ట్రాక్టర్‌ను దగ్ధం చేశారు.

ఈలోగా రెండు యాక్షన్‌ టీంలు మళ్లీ అక్కడకు వచ్చాయి. అందరూ కలసి గోదావరి తీరం దాటి అడవిలోకి వెళ్లిపోయారు. ఒకేసారి నాలుగు లారీలు, మూడు పొక్లెయిన్లు, ఒక ట్రాక్టర్‌ను తగులబెట్టడంతో డీజిల్‌ ట్యాంక్‌లు పేలి భారీ శబ్దాలు వచ్చాయి. భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. మణుగూరు డీఎస్పీ ఆర్‌.సాయిబాబా ఆధ్వర్యంలో ఏడూళ్లబయ్యారం సీఐ జయపాల్‌రెడ్డి, పోలీసులు శనివారం ఉదయం మూడు ప్రాంతాలను సందర్శించారు. బాధిత కుటుంబాల నుంచి, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు.


కాల్పులు అమానుషం - తమ్మినేని
సాక్షి, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మడివి రమేశ్‌పై శుక్రవారం మావోయిస్టులు జరిపిన హత్యాయత్నాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ప్రజల తరఫున నిలబడి, ఉద్యమాలు చేస్తున్న గిరిజన నాయకుడిపై కాల్పులు జరపడం అమానుషమని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాల్పులను సమర్థించుకోడానికి ఇన్‌ఫార్మర్‌ ముద్ర వేస్తున్నారని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


సుజాతక్క నేతృత్వంలో..?
మూడు ఘటనలకు వారం రోజుల క్రితమే పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. మావోయిస్టు సుజాతక్క నేతృత్వంలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మణుగూరు ఏరియా కమిటీ నెల రోజుల క్రితం ఏర్పడినట్లు సమాచారం. 50 మంది సభ్యులున్న మావోయిస్టుల బృందంలో సుమారు 10 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని, హిందీ, గొత్తికోయ భాషల్లో వారు మాట్లాడుకున్నారని అక్కడి వారు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు