ఎల్‌ఆర్‌ఎస్‌ పరుగు

1 Mar, 2018 07:52 IST|Sakshi
ఎల్‌బీనగర్‌: ఈస్ట్‌ జోనల్‌ కార్యాలయంలోఎల్‌ఆర్‌ఎస్‌ మేళాలో రద్దీ

దరఖాస్తు చేసేందుకు బారులే బారులు  

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాలు కిటకిట

మార్చి 31 వరకు గడువు పొడిగింపుతో ఊరట

లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌)కు బుధవారమే చివరి గడువుగా ప్రకటించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. దరఖాస్తుదారులు భారీసంఖ్యలో జీహెచ్‌ఎంసీ జోనల్, హెచ్‌ఎండీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. ఫీజు చెల్లింపులకు మరికొన్ని రోజులు గడువు పొడిగించాలంటూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మార్చి 31 వరకు గడువు పొడిగించగా.. హెచ్‌ఎండీఏకు మరో రూ.150 కోట్లు, జీహెచ్‌ఎంసీకి రూ.30 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌)కు బుధవారమే చివరి గడువుగా ప్రకటించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. దరఖాస్తుదారులు భారీసంఖ్యలో జీహెచ్‌ఎంసీ జోనల్, హెచ్‌ఎండీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. ఫీజు చెల్లింపులకు మరికొన్ని రోజులు గడువు పొడిగించాలంటూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారిలో దాదాపు 8వేల మంది తిరిగి తమ దరఖాస్తులను పరిశీలించాలంటూ   హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకున్నారు. గడువును దృష్టిలో పెట్టుకొని జీహెచ్‌ఎంసీ  గత మూడు రోజులుగా జోనల్‌ కార్యాలయాల్లో ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్నప్పటికీ, చివరి రోజు జోనల్‌ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా అధిక సంఖ్యలో దరఖాస్తులందిన ఈస్ట్, వెస్ట్‌జోన్‌ కార్యాలయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.  వెస్ట్‌జోన్‌ కార్యాలయానికి వచ్చిన వారిలో జోన్‌ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల కు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. దాదాపు 440 దరఖాస్తుల్ని అధికారులు పరిష్కరించారు. దాదాపు రూ.4.40 కోట్ల ఆదాయం వచ్చింది. 

ఎల్‌బీనగర్‌ జోనల్‌ కార్యాలయానికి ఎల్‌బీనగర్, కాప్రా, ఉప్పల్‌ సర్కిళ్ల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. గత మూడు రోజులుగా మేళా నిర్వహిస్తుండగా తొలి రెండు రోజుల్లో దాదాపు 700 ఫైళ్లు పరిష్కారం కాగా, బుధవారం ఒక్కరోజే 650 ఫైళ్లు పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులకు అవకాశం లేకపోవడం..బ్యాంకు డీడీలు తెచ్చిన వారికి వెంటనే ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తామనడంతో ఉదయం నుంచే సందడి మొదలైంది. బ్యాంకు వేళలు ముగిసిపోతున్నప్పటికీ కొందరికి తమ దరఖాస్తులు సవ్యంగా ఉన్నదీ లేనిదీ తెలియక, ఫీజులు ఎంత చెల్లించాలో తెలియక ఇబ్బంది పడ్డారు. చివరి రోజు కావడంతో రాత్రి పొద్దుపోయేంత వరకు అందుబాటులో ఉండేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మార్చి 31 వరకు  ప్రభుత్వం గడువు పొడిగించినట్లు సాయంత్రం  తెలియడంతో దరఖాస్తుదారులు ఊపిరి పీల్చుకున్నారు. జీహెచ్‌ఎంసీకి అందిన మొత్తం 71,808 దరఖాస్తుల్లో దాదాపు 43 శాతం షార్ట్‌ఫాల్స్‌ ఉన్నట్లు  అధికారులు పేర్కొన్నారు. మధ్యవర్తులను నమ్మి మోసపోయామని హెచ్‌ఎండీఏలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారు వాపోయారు. గడువు పొడిగింపుతో హెచ్‌ఎండీఏకు మరో రూ.150 కోట్లు రానుండగా, జీహెచ్‌ఎంసీకి దాదాపు రూ.30 కోట్లు ఆదాయం రానుందని అంచనా.

మరిన్ని వార్తలు