‘పొరుగు ధాన్యాన్ని అడ్డుకోండి’

15 Nov, 2019 02:54 IST|Sakshi

పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో సీలింగ్‌ విధించడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో దళారులు, వ్యాపారస్తులు రైతుల పేరుతో తెలంగాణలో ధాన్యం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దులో గట్టి నిఘాతో దీన్ని అరికట్టాలని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్ర రైతులకు నష్టం కలిగించే ఏ చర్యను కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడి శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని లోడింగ్‌ చేసి ఆ వివరాలను కేంద్రాల నిర్వాహకులు ఓపీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు (ట్రక్‌ షీట్‌) చేస్తున్నారని, నమోదు చేసిన వివరాలకు రైస్‌ మిల్లర్లు ఆన్‌లైన్‌లోనే ఆమోదం తెలపాలని సూచించారు. తద్వారా రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల్లో త్వరితగతిన రైతు బ్యాంక్‌ ఖాతాలో జమ చేసేందుకు వీలవుతుందన్నారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో కేంద్రం నిబంధనల మేరకు తేమ 17 శాతంలోపు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంట పొలాల నుంచి ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురాకుండా దశలవారీగా తీసుకువచ్చేలా కేంద్రాల నిర్వాహకులు రైతులకు
సూచించాలన్నారు.  

మరిన్ని వార్తలు