యార్డుకు కళొచ్చింది

22 Nov, 2018 17:53 IST|Sakshi
పత్తి తూకం వేస్తున్న సొసైటీ సిబ్బంది(ఫైల్‌)

జైనథ్‌: మండలకేంద్రంలో మార్కెట్‌యార్డు ప్రా రంభమై మూడు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పత్తి కొనుగోలు చేయలేదు. గడిచిన నాలుగైదేళ్ల వరకూ కనీసం సోయా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సోయాతోపాటు శనగలు, కందులు కూడా మార్కెట్‌లో కొనుగోలు చేస్తుండడంతో మార్కెట్‌కు ఓ కళ వచ్చింది. గతంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ అంతగా విజయవంతం కాలేదు. మండలకేంద్రంలో జిన్నింగ్‌లు లేకపోవడం, ట్రేడర్లు ఆసక్తి చూపకపోవడంతో కొనుగోలు జరగలేదు. ప్రస్తుతం చిన్న, సన్నకారు రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేపడుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

పీఏసీఎస్‌ ద్వారా కొనుగోళ్లు..
మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం(పీఏసీఎస్‌), మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే కేవలం సన్నకారు, చిన్నకారు రైతులను ఉద్దేశించి మాత్రమే ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. చిన్న రైతులు తమ పత్తిని రోడ్ల వెంబడి ఉండే వ్యాపారుల వద్ద అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులకు మార్కెట్‌ ధర లభించడమే కాకుండా రవాణా ఖర్చులు తగ్గడంతో ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇక్కడ పత్తి అమ్మేందుకు వచ్చిన రైతుల హమాలీ, దళారీ, రవాణా ఖర్చుల పేరిట ఎలాంటి అదనపు వసూళ్లు ఏవీ లేకపోవడంతో కలిసొస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
 

ఇవీ నిబంధనలు..

  • రైతులు పట్టాదార్‌ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ జిరాక్స్‌ పత్రాలు తీసుకు రావాలి.
  • ఒక రోజు ఒక రైతు నుంచి 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. 
  • రోజువారీగా 100 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయబడుతుంది.
  • చిన్న, సన్నకారు రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేయబడును.
  • కౌలు రైతులు సంబంధిత ఏఈవో నుంచి పంట ధ్రువీకరణపత్రం తీసుకు రావాలి.
  • తేమ 8శాతానికి మించకుండా ఉండాలి.
మరిన్ని వార్తలు