39 శాతం పత్తికే మద్దతు ధర

5 Nov, 2017 02:09 IST|Sakshi

రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 33.25 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు మార్కెట్లకు 15.16 లక్షల క్వింటాళ్ల పత్తి రాగా, అందులో 5.87 లక్షల క్వింటాళ్ల (39%) పత్తికి కనీస మద్దతు ధర లభించిందని పేర్కొంది. ఖరీఫ్‌లో పండించిన వివిధ పంటలు, ధర తదితర వివరాల నివేదికను విడుదల చేసింది.   

60 శాతం వరకు రంగు మారిందే..
ఇప్పటి వరకు వరంగల్‌ మార్కెట్‌కు వచ్చిన పత్తిలో దాదాపు 60 శాతం వరకు రంగు మారింది. దీని తేమ శాతం సరాసరి 25 శాతం ఉంది.  8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తి మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. 12 శాతం నుంచి 25 శాతమున్న పత్తి, రంగు మారిన పత్తిని బీ గ్రేడ్‌గా పరిగణించి కొనాలని కేంద్రానికి విన్నవించినట్లు ఆ నివేదికలో తెలిపింది.

పెసరకు మద్దతు ధర రూ.5,575
రాష్ట్రంలో ఖరీఫ్‌లో పెసర 2.75 లక్షల ఎకరాల్లో పండించారు. దాదాపుగా 1.1 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. కేంద్రం క్వింటాలు పెసరకు రూ.5,575 మద్దతు ధర ప్రకటించింది. 12 కేంద్రాల ద్వారా 2,512 మంది రైతుల నుంచి రూ.11.62 కోట్లతో 2,084 మెట్రిక్‌ టన్నుల పెసర కొన్నట్లు నివేదికలో తెలిపింది.

రాష్ట్రంలో మినుములు 80 వేల ఎకరాల్లో పండించారు. దాదాపు 30 వేల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇప్పటివరకు 13 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 23.26 కోట్లతో 4,308 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. మొక్కజొన్న 11.45 లక్షల ఎకరాల్లో పండించారు. దాదాపు 28.12 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా. దాదాపు 2.48 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా. 
 
19.38 లక్షల ఎకరాల్లో వరి..
ఖరీఫ్‌లో 19.38 లక్షల ఎకరాల్లో వరి పండించారు. దాదాపు 46.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా. కేంద్రం ఏ గ్రేడ్‌ రకానికి రూ.1,590, బీ గ్రేడ్‌ రకానికి రూ.1,550 మద్దతు ధర ప్రకటించింది. 2,902 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నెల 31 నాటికి 914 కేంద్రాలు ఏర్పాటుచేసి 1.18 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.  

మరిన్ని వార్తలు