మార్క్‌ఫెడ్‌ ‘ఔట్‌’!

3 Feb, 2020 03:33 IST|Sakshi

వ్యవసాయశాఖ కీలక అడుగులు.. రైతు సమన్వయ సమితిలో విలీనం?

ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల మధ్య ఈ అంశంపై ఇటీవల చర్చలు

‘సమితి’కి అధికారాలు, పరిపాలనా విభాగం సమకూర్చడమే ప్రధాన లక్ష్యం

ఇటు యూరియా సరఫరాలో మార్క్‌ఫెడ్‌ విఫలమవ్వడంపై విమర్శల వెల్లువ

సాక్షి, హైదరాబాద్‌: రైతు సమన్వయ సమితిలో మార్క్‌ఫెడ్‌ను విలీనం చేస్తున్నారా? తద్వారా రైతు సమన్వయ సమితిని బలోపేతం చేస్తారా? ఇక నుంచి పంట ఉత్పత్తుల సేకరణ, ఎరువుల సరఫరా బాధ్యత రైతు సమితే తీసుకుం టుందా? అంటే అవుననే అంటు న్నాయి వ్యవసాయ శాఖ వర్గాలు. ఆ దిశగా కీలక అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. రెండ్రోజుల కిందట వ్యవ సాయ శాఖకు చెందిన ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధుల మధ్య ఈ అంశంపై సీరియస్‌గా చర్చలు జరిగాయని, ఈ చర్చల అనంతరం ఒక ప్రజాప్రతినిధి ‘విలీనం జరిగే అవకాశాలు మెం డుగా కనిపిస్తున్నాయ’ని తమ వద్ద ప్రస్తావించినట్లు మార్క్‌ఫెడ్‌ ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు ‘మార్క్‌ఫెడ్‌ గత ఖరీఫ్‌లో యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైంది. పంట ఉత్పత్తుల కొను గోలులోనూ అనేక అవకతవకలు జరుగు తున్నాయి.

మొక్కజొన్న విక్రయాల పైనా విమర్శలు వచ్చాయి. దీంతో మార్క్‌ఫెడ్‌పై ఉన్నత స్థాయి వర్గాలు గుర్రుగా ఉన్నాయ’ని ఆయన ప్రస్తా వించారని తెలిసింది. దీంతో మార్క్‌ ఫెడ్‌లో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక మార్క్‌ఫెడ్‌ ఎరువులను సరఫరా చేస్తుండగా, తాజాగా ఆగ్రోస్‌ను కూడా అడిషనల్‌ నోడల్‌ ఏజెన్సీగా నియమించారు. అంటే ఇక నుంచి  ఆగ్రోస్‌ కూడా తమ ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా కంపెనీల నుంచే నేరుగా ఎరువులను సరఫరా చేయనుంది. ఇప్పటికే దానికి సంబం ధించి తాజాగా వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మార్క్‌ ఫెడ్‌ను రోజురోజుకూ నిర్వీర్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రైతు సమితిలో మార్క్‌ఫెడ్‌ను విలీనం చేస్తే దానిలో ఉన్న సమితి సభ్యులతో తాము పనిచేయడం కష్టంగా మారుతుందని అంటున్నారు. ఏది చేయాలన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది.

పరిపాలనా విభాగం ఏర్పాటే లక్ష్యం..
రైతు సమన్వయసమితి ఏర్పాటై ఇన్నాళ్లయినా దానికి సంబంధించి పూర్తిస్థాయి కార్యక్రమాలు ప్రారంభంకాలేదు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షలన్నర మందికిపైగా కిందినుంచి పైస్థాయి వరకు సభ్యులున్నారు. దానికి చైర్మన్‌ గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు దానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. రైతు దుక్కి దున్ని పంట పండించి, మార్కెట్‌కు తీసుకెళ్లే వరకూ సమితి సభ్యులు అండగా ఉండాలనేది సర్కారు ఉద్దే శం. రైతుబంధు నిధులు అందేలా చేయడం, బ్యాంకుల్లో పంట రుణాలు ఇప్పించేలా కృషి చేయడం, పంట పండించాక దాన్ని మద్దతు ధరకు విక్రయించే ఏర్పాట్లు చేయడం, దేశంలో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో మంచి ధరలున్నాయో గుర్తించి అక్కడికి పంట ఉత్పత్తులు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటి అనేక కీలకమైన బాధ్యతలు సమన్వయ సమితి చేయాలనేది సర్కారు లక్ష్యం.

అంతేకాదు ఎరువులు, విత్త నాలు సకాలంలో రైతులకు అందించేలా చేయ డం, నాసిరకం విత్తనాలు అమ్మకుండా అడ్డుకో వడం, పంట పండించాక మార్కెట్లో ఇబ్బందు లు తలెత్తకుండా సమితి సభ్యులు కృషి చేయా లని కూడా సీఎం కేసీఆర్‌ వారికి అప్పట్లో దిశానిర్దేశం చేశారు. అయితే రైతు సమన్వయ సమితికి ఇవన్నీ చేసే పరిపాలనా విభాగం లేదు. అధికారులు, ఉద్యోగులు, ఇతరత్రా వ్యవస్థ ఏర్పాటు కాలేదు. కేవలం చైర్మన్లు, సభ్యులు మాత్రమే ఉన్నారు. దీనికి ఎటువంటి అధికారాలు, పరిపాలనా యంత్రాంగం, చెక్‌ పవర్‌ వంటివేవీ లేవు. ఈ పరిస్థితిని మార్చాల నేది సర్కారు ఉద్దేశం.

ఇటు రైతు సమన్వయ సమితి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రకా రమే మార్క్‌ఫెడ్‌ రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేస్తుంది. పంట ఉత్ప త్తులను కొనుగోలు చేస్తుంది. కాబట్టి మార్క్‌ ఫెడ్‌ను విలీనం చేస్తే, ఆ పరిపాలనా యం త్రాంగం మొత్తం రైతు సమితిలోకి వచ్చి పరి పుష్టిగా ఉంటుందనేది ఆ ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధులు భావించినట్లు సమాచారం. మార్క్‌ఫెడ్‌లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం, విభాగం ఉంది. దానికి చైర్మన్, ఎండీ, జనరల్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు. కానీ దాన్ని సక్రమంగా నడిపించడం లేదన్న ఆరోపణలు న్నాయి. రైతు సమన్వయ సమితిలో మార్క్‌ఫెడ్‌ విలీనంపై వివరణ ఇవ్వడానికి అటు అధికారులు, ఇటు సంబంధిత ప్రజాప్రతినిధులు సుముఖంగా లేరు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు