చెన్నారెడ్డి సేవలు చిరస్మరణీయం

29 Dec, 2019 13:21 IST|Sakshi

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాహితం కోసం మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తుతించారు. హైటెక్ సిటీ శిల్ప కళావేదికలో ఆదివారం జరిగిన మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మర్రి చేసిన పోరాటాన్ని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. చెన్నారెడ్డి సూచించిన దారిలో నడవడమే ఆయనకు మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు. ‘శాసనసభ లో ఎన్ని‌ విమర్శలు చేసినా హుందాగా స్వీకరించే వారు. మేం అడిగిన ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు చెప్పేవారు. శాసన సభలో తాను,  జైపాల్ రెడ్డి ఎన్నో సార్లు ప్రశ్నలు సంధించేవాళ్లం’ అని చెప్పారు. 

పదవులకే వన్నె తెచ్చారు..
ఆయన చేపట్టిన ప్రతి పదవికి వెన్నె తెచ్చారని వెంకయ్య నాయుడు  కొనియాడారు. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని, రైతు కుటుంబం వచ్చి.. రైతులకు ఎంతో మేలు చేశారని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు.  నీటి పారుదల రంగం‌ కోసం విస్తృతంగా కృషి చేశారన్నారు. పరిపాలనలో‌ ఉన్న లోటుపాట్లను సరి చేశారన్నారు. భూ సమస్యల పరిష్కారం కొసం కొత్త పద్దతిని అవలంబించారని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు.. నిరుపేదలకు భూ పంపిణీ చేశారని పేర్కొన్నారు. యువత నక్సలిజం, తీవ్రవాదం వైపు మళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో మర్రి చెన్నారెడ్డి అవలంబించిన విధానాలను‌ ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

వ్యక్తిగత దూషణలు ప్రమాదకరం..
ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలు ప్రమాదకరమని.. మన దగ్గర సబ్జెక్టు ఉంటే అరిచి గగ్గోలు‌పెట్టాల్సిన అవసరం ఉండదని వెంకయ్య నాయుడు అన్నారు.  నిర్మాణాత్మకమైన చర్చలు జరిగినప్పుడే వ్యవస్థను‌ మెరుగుపర్చవచ్చని పేర్కొన్నారు. కన్నతల్లిని, మాతృభూమిని మరిచిపోవద్దని  ఆయన పిలుపునిచ్చారు.

సాధించే వరకు నిద్రపోయే వారు కాదు..
భారత రాజకీయ చరిత్రలో చెన్నారెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా గొప్పదని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన అనుకున్నది సాధించే వరుకు నిద్రపోయేవారు కాదన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించేవారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత కూడా ఆయన అన్ని ప్రాంతాల వారి హృదయాలను గెలుచుకున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారన్నారు.  ఎస్సారెస్పీతో తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేశారన్నారు.  ఆయన  గొప్ప జాతీయవాది అని, రాజస్థాన్‌ గవర్నర్‌గా ఉండి కశ్మీర్‌ అంశంపై మాట్లాడిన వ్యక్తి అని దత్తాత్రేయ పేర్కొన్నారు.

ఆయన ఓ మహానుభావుడు..
మర్రి చెన్నారెడ్డి ఎంతంటి గొప్పవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఓ మహానుభావుడని మాజీ గవర్నర్‌ కె.రోశయ్య పేర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టారని, వాటికి వన్నె తెచ్చారని తెలిపారు.

అభివృద్ధిపైనే చర్చించే వారు..
మర్రి చెన్నారెడ్డిని ఎప్పుడు కలిసినా అభివృద్ధి గురించే చర్చించేవారని సీనియర్‌ జర్నలిస్ట్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేదన్నారు. 

ఆయన పోరాటం ఎంతో గొప్పది..
పేదల అభివృద్ధికి మర్రి చెన్నారెడ్డి ఎంతో కృషి చేశారని కాంగ్రెస్‌ నేత ఆర్సీ కుంతియా అన్నారు. ఇందిరాగాంధీతో రాజకీయంగా ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. తెలంగాణ సాధించడం కోసం చెన్నారెడ్డి చేసిన పోరాటం ఎంతో గొప్పదన్నారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ఏ బాధ్యత చేపట్టిన దానికి వెన్నె తెచ్చారన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు