ఇక పల్లెల్లోనే వివాహ రిజిస్ట్రేషన్‌

1 Mar, 2019 08:13 IST|Sakshi

గ్రామ కార్యదర్శికి బాధ్యతలు  

తెల్లకాగితాలపై రాసిచ్చే ఆనవాయితీకి చెక్‌ 

వివాహాల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై పల్లెల్లోనే వివాహాల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. గ్రామాల్లో జరిగే ప్రతి వివాహాన్ని రిజిస్టర్‌ చేయాలన్న కొత్త పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనలతో మార్చి నుంచి విధానం అమల్లోకి రానుంది. గ్రామాల్లో రహస్యంగా జరిగే బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇది దోహదపడనుంది. అందరికీ సులభంగా వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రం అందుబాటులోకి రానుంది. పంచాయతీరాజ్‌ చట్టం లోనే వివాహ నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయడంతో దీనిపై మరింత స్పష్టతనిస్తూ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలిచ్చింది. 

పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత.. 
గ్రామాల్లో జరిగే ప్రతి వివాహాన్ని నమోదు చేసే బాధ్యతను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కట్టబెట్టారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌పై అవగాహన కొరవడటంతో వివాహాల నమోదు ఊపందుకోలేదు. దీంతో పాటు బాల్య వివాహాలు పెరగడంతో దీన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకేలా వివాహాల నమోదుకు వివాహ మెమోరాండం, రిజిస్టర్, సర్టిఫికెట్లను రూపొందించి కార్యదర్శులకు అందజేశారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటకు పెళ్లి మెమోరాండం అందజేసి, పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. దీని కోసం ఆధార్‌కార్డు, పెళ్లి ఆహ్వాన పత్రిక, వివాహ ఫొటోలు, గ్రామంలోని ముగ్గురు సాక్షుల సంతకాలు తీసుకుంటారు. మరు సటి రోజే వివాహ సర్టిఫికెట్‌ జారీచేస్తారు. 

అవగాహనా రాహిత్యంతో..: ఉమ్మడి ఏపీలో 2002లోనే వివాహ నమోదు చట్టాన్ని తీసుకొచ్చినా అది 2006 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రతి పెళ్లిని రిజిస్టర్‌ చేయాల్సి ఉంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోనూ రిజిస్టర్‌ చేసుకోవచ్చు. గతంలో వివిధ దశల్లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు అవకాశమిచ్చినా, ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన, చైతన్యం ఏర్పడే దిశలో ప్రచారం కొరవడటంతో వివాహ రిజిస్ట్రేషన్‌ ఊపందుకోలేదు. ఏటా పెళ్లిళ్ల సీజన్‌లో పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతున్నా వాటిని రిజిస్టర్‌ చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల నమోదును కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు నడుం బిగించింది.  
 

మరిన్ని వార్తలు