పెళ్లి రోజే.. వివాహిత ఆత్మహత్య

26 Mar, 2017 14:34 IST|Sakshi
పెళ్లి రోజే.. వివాహిత ఆత్మహత్య
హైదారాబాద్‌: నగరంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లిరోజే కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బేగంపేటలో జరిగింది. ఆరేళ్లు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ప్రేమజంట కాపురం ఆర్నెళ్లు కూడా సజావుగా సాగలేదు. తప్పు ఎవరిదైనా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. ఇది కాస్త మహిళా పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ పోలీసులు కౌన్సెలింగ్‌ పేరుతో కాలయాపన చేశారు. పెళ్లి జరిగి శనివారానికి ఏడాదైంది. అప్పుడే తామిద్దరి మధ్య అంతులేని దూరం రావడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని సూసైడ్‌ నోట్‌ రాసింది. పోలీసులను కూడా అత్తింటి వారు కొనేసారని నోట్‌లో పేర్కొంది.
 
బేగంపేటకు చెందిన భాగ్యలక్ష్మి (29) ఏఎండీ సంస్థలో ఉద్యోగి. కర్మన్‌ఘాట్‌కు చెందిన శశి గూగుల్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వీరిద్దరూ ఆరేళ్లు ప్రేమించుకున్న అనంతరం గతేడాది మార్చి 25న పెళ్లి చేసుకున్నారు. ఏఎండీ క్వార్టర్స్‌లో కాపురం పెట్టారు. ఆరు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తన అత్తింటి వారు మానసికంగా వేధిస్తున్నారంటూ భాగ్యలక్ష్మి బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. శనివారం ఆ దంపతుల మొదటి మ్యారేజ్‌ డే. మానసికంగా కుంగిపోయిన భాగ్యలక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. అత్తింటి వేధింపులతోనే భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నారు. 
 
మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాచావుకు కారణం భర్త శశి, మంజుల, భాస్కర్‌, రమణి మానసికంగా హింసించారు. భర్త నామాట వినకుండా విడిపోయాడు. నేను చనిపోయాక నాశవాన్ని నావస్తువులను శశి ఫ్యామిలీని ముట్టుకోనీయొద్దు. బేగంపేట పోలీసులనూ వారు కొనేశారు. వాళ్లని నమ్మొద్దు... ప్లీజ్‌ అమ్మాయిలు జాగ్రత్త మోసపోకండి. సారీ మమ్మి, డాడి, శివ అని రాసి పెట్టింది.