అయ్యో.. నవనీత

27 Jan, 2015 00:07 IST|Sakshi
అయ్యో.. నవనీత

మెదక్ మండల ఎనగండ్ల గ్రామంలో సోమవారం ఉదయం ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. తమకేం పాపం తెలియదని అత్తింటివారు అంటుంటే... అత్తింటివారే తమ పిల్లను చంపేశారని నవనీత పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా నవనీత మృతితో ఏడాదిన్నర వయస్సున్న ఆమె కుమారుడు మాత్రం మాతృప్రేమకు దూరమయ్యాడు.
 
కొల్చారం: మండల పరిధిలోని ఎనగండ్ల గ్రామంలో సోమవారం ఉదయం ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రాములు, రామవ్వల కుమారుడు మల్లేశంతో రేగోడ్ మండలం ఖాదిరాబాద్‌కు చెందిన ఏసమ్మ, మల్లయ్య కూతురు నవనీత(24)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఉన్నాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం కుటుంబ సమేతంగా వెళ్లి.. కౌడిపల్లి మండలం నల్లపోచమ్మ ఆలయం వద్ద మల్లేశం సోదరి కుమారుని పుట్టు వెంట్రుకలు తీసి, ఇంటికి చేరుకున్నారు. అదే రాత్రి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో భర్త మల్లేశం గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు బయటకు వెళ్లగా.. మామ ఊరిబయట ఉన్న మేకల మంద వద్దకు వెళ్లాడు.

అత్త రామవ్వ కల్లాపీ చల్లి.. పిల్లవాడికి పాలు తాగిం చి తాను కూడా మేకల వద్దకు వెళ్లింది. గంట తరువాత ఇంటికి తిరిగివచ్చిన అత్త రామవ్వకు లోపలి నుంచి కాలిన వాసన వచ్చింది. తలుపు తెరచి చూడగా పూర్తిగా కాలిన స్థితిలో నవనీత నిర్జీవంగా కనిపించింది. విషయం తెలుసుకున్న కొల్చా రం ఎస్‌ఐ రమేష్‌నాయక్  సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని తరలించేందుకు ప్రయత్నించా డు. అయితే నవనీతను అత్తింటివారే చంపేశారం టూ మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. తమకు న్యాయం జరిగే వరకూ కదిలేదని లేదం టూ భీష్మించుకు కూర్చున్నారు.
 
దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్‌ఐ రమేష్‌నాయక్ విషయాన్ని మెదక్ రూరల్ సీఐ రామకృష్ణకు తెలపడంతో ఆయన గ్రామానికి చేరుకుని నవనీత బంధువులకు నచ్చజెప్పారు. న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. అనంతరం నవనీత శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్  ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు