నా భర్తపై చర్యలు తీసుకోండి   

26 Nov, 2019 10:19 IST|Sakshi

ఎస్పీకి ఓ వివాహిత వినతి  

సాక్షి, సంగారెడ్డి: నా భర్త ప్రతీ రోజు మద్యం సేవించి నన్ను కొడుతున్నాడు. మానసికంగా వేధిస్తున్నాడు. ఇంట్లో వస్తువులు అమ్ముకొని ఇబ్బంది పెడుతున్నాడు. పుట్టింటి నుండి అదనపు కట్నం తీసుకురమ్మని అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. నాకు న్యాయం చేయండి అని హత్నూర మండలానికి చెందిన ఓ వివాహిత ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డికి విన్నవించింది. పోలీస్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదులను సోమవారం ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్వయంగా స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి.   

‘నా భార్య అత్యాచారం, హత్యకు గురైన కేసులో ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం ప్రభుత్వం రూ.8.50 లక్షలను మంజూరు చేసింది. నా మానసిక స్థితి బాగోలేకపోవడంతో మరో వ్యక్తి నా బ్యాంకు అకౌంట్‌ నుండి డబ్బులను తీసుకున్నాడు. నా డబ్బు నాకు వచ్చేలా చూడండి’ అని కంది మండలానికి  చెందిన ఓ ఫిర్యాదుదారుడు కోరారు.  ‘నాకు 2008లో వివాహం జరిగింది. నా భర్త అదనపు కట్నం కోసం వేధించడంతో కేసు నమోదు చేయించాం. కోర్టు నా భర్తకు, మామకు జైలు శిక్ష వేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం నేను భర్త ఇంట్లోనే ఉంటున్నా. కానీ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని నన్ను వేధిస్తున్నాడు. ఇంటి నుండి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు న్యాయం చేయాల’ని కంది మండలానికి చెందిన ఫిర్యాదుదారురాలు కోరారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా