వివాహిత బలవన్మరణం

10 Apr, 2015 04:17 IST|Sakshi

పచ్చర్లబోడుతండా(భువనగిరి అర్బన్): కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని పచ్చర్లబోడుతండాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పచ్చర్లబోడుతండా గ్రామానికి చెందిన మేగావత్ సర్థార్‌కు 15 సంవత్సరాల క్రితం మీటితండాకు చెందిన బుజ్జమ్మతో వివాహం జరిగింది. మూడేళ్లకే మనస్పర్థలు వచ్చి విడిపోయారు. సర్థార్‌నాయక్ 12 ఏళ్ల క్రితం బొమ్మలరామారం మండలానికి చెందిన మేగావత్ పద్మ(28)ను వివాహం చేసుకున్నాడు. వీరికి 7 సంవత్సరాల బాబు ఉన్నాడు.  ఇదిలా ఉండగా మేగవత్ సర్థార్ కొన్ని రోజులుగా మొదటి భార్య బుజ్జమ్మతో సఖ్యతగా ఉంటున్నాడు. ఈ విషయం పద్మకు తెలియడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
 
  సర్థార్ ఎంత చెప్పినా వినకపోవడంతో పద్మ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 5 గంటల సమయంలో గ్రామ సమీపంలోని ఓవ్యవసాయ బావిలో దూకింది. కల్లాపి చల్లడానికి పేడ తీసుకువస్తానని వెళ్లిన పద్మ ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఓ వ్యవసాయ బావి వద్ద ఆమె చెప్పులు, పేడ జబ్బ కనపించింది. వెంటనే బావిలోకి దిగి చూడగా అప్పటికే పద్మ మృతిచెందింది. ఈ మేరకు సంఘటన స్థలం వద్ద రూరల్ పోలీసులు శవ పంచానమా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు రూరల్ ఎస్‌ఐ నర్సింగ్‌రావు తెలిపారు.
 

మరిన్ని వార్తలు