ఆత్మరక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌

21 Nov, 2017 01:51 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా బాలికలకు శిక్షణ

సాక్షి, యాదాద్రి: మహిళలపై అఘాయిత్యా లను ఎదురించేందుకు ఉన్నత పాఠశాల స్థాయిలోనే విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాఠశాలల్లోని పీడీ, పీఈటీలకు శిక్షణ ఇచ్చింది. వీరితోపాటు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన మాస్టర్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తుంది. దీనికి విద్యాశాఖ ఆర్‌ఎంఎస్‌ఏ సంయుక్తంగా మూడు నెలల శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. 31 జిల్లాల్లో 5,111 ఉన్నత పాఠశాలలకు నిధులను మంజూరు చేసింది. ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.8,500 చొప్పు న రూ.4.34 కోట్లను మంజూరు చేసింది. 

ఇలా శిక్షణ ఇవ్వాలి..
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, బాలికల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో ఈ శిక్షణను ఇస్తారు. ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఈటీలు, పీడీలు, పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ల ఆధ్వర్యంలో మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ జరగాలి. స్వయం ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వాలి. పాఠశాల గేమ్స్‌ పిరియడ్‌లో మాత్రమే వీటిని పీఈటీల ఆధ్వర్యంలో నిర్వహించాలి. శిక్షణ పొందిన బాలికలకు 15 రోజులు లేదా నెల రోజులకోసారి అంతర్‌ పాఠశాలల స్థాయి, మండల స్థాయిలో వీరికి పోటీలు నిర్వహిం చాలి. ప్రతి ప్రధానోపాధ్యాయుడు మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ కార్యాలయాలకు వాట్సాప్‌లో మెసేజ్‌ పంపాలి. ఇందుకోసం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యా యులకు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు