ప్రభుత్వ పాఠశాలల్లో మార్షల్‌ ఆర్ట్స్‌

4 Dec, 2019 09:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విద్యాశాఖ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇప్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్జేడీలకు, అన్ని జిల్లాల డీఈవోలకు పాఠశాల విద్యా కమిషనర్‌ విజయ్‌కుమార్‌ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. 100కు పైగా విద్యార్థినులున్న పాఠశాలల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.9 వేల చొప్పున రూ.1.38 కోట్లు సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కింద కేటాయించారు. 31 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,513 ఉన్నత పాఠశాలలు మొత్తంగా 1,544 పాఠశాలల్లో విద్యార్థినులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణను ఈనెలలో ప్రారంభించి ఫిబ్రవరి వరకు నిర్వహించాలని ఆదేశాల్లో స్పష్టంచేశారు. ప్రతి వారం రెండు క్లాసులు (క్లాస్‌కు గంట చొప్పున రెండు గంటలు) నిర్వహించాలని, అర్హత కలిగిన వారితోనే శిక్షణ ఇప్పించాలని, వారికి నెలకు రూ.3 వేల చొప్పున మూడు నెలలు చెల్లించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు