ఇళ్లకు చేరుకున్న మాసాయిపేట బాధితులు

1 Aug, 2014 01:36 IST|Sakshi
ఇళ్లకు చేరుకున్న మాసాయిపేట బాధితులు

తూప్రాన్ : బస్సు ప్రమాద దుర్ఘటన నుంచి తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కోలుకున్న చిన్నారులు గురువారం స్వగ్రామాలకు చేరుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి చిన్నారులను పరామర్శించారు. డిశ్చార్జి అయిన వారిలో వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు, గుండ్రెడ్డిపల్లికి చెందిన ఇద్దరు, కిష్టాపూర్‌కు చెందిన మరో చిన్నారి ఉన్నారు. ఇంటికి రాగానే బాధిత చిన్నారులు కుటుంబ సభ్యులకు గురించి ఆరా తీశారు. అయితే వాస్తవ విషయాన్ని కప్పిపెట్టి చిన్నారులను వారి తల్లిదండ్రులు ఓదార్చారు.  
 
నాన్నా.. చెల్లి ఎక్కడుంది?
చెల్లి ఎక్కడుంది నాన్నా.. కనపడడం లేదే.. అంటూ వెంకటాయిపల్లికి చెందిన రుచిత తన తండ్రి మల్లాగౌడ్‌ను ప్రశ్నించింది. వాస్తవానికి శ్రుతి బస్సు ప్రమాదంలో మృతిచెందింది. ఈవిషయం రుచితకు తెలియదు. అయితే తను అమ్మమ్మ వద్ద ఉందని రుచితకు తండ్రి సర్దిచెబుతూ కంటతడి పెట్టాడు.
 
కుటుంబాన్ని చూసి మురిసిపోయి..

వారం రోజులుగా శరీరం నిండా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన శ్రావణి.. వెంకటాయపల్లిలోని ఇంటికి రాగానే తన ఇద్దరు అక్కయ్యలను, తమ్ముణ్ని చూసి మురిసిపోయింది.
 
అల్లా.. దయాతోనే కుమార్తె క్షేమం
అల్లా.. దయతోనే తన కుమార్తె నబీరాఫాతిమా బయటపడిందని తల్లిదండ్రులు షేక్ ఆయూబ్, రఫీయాబేగంలు అన్నారు. ‘బస్సులో అందరం కలిసి మాట్లాడుతున్నాం. ఇంతలోనే రైలు వచ్చి తమ బస్సును గుద్దింది.  తరువాత ఏం జరిగిందో తెలియదు’ అని ఫాతిమా అంది.
చెల్లి, తమ్ముడు ఎక్కడా...?
‘అమ్మా.. చెల్లి, తమ్ముడు ఎక్కడ ఉన్నారు. నేను ఇంటికి వస్తే వారు నా దగ్గరకు రావడం లేదు. ఎక్కడున్నారమ్మా..? అని చిన్నారి త్రిష ప్రశ్నకు సమాధానం చెప్పలేక విలపించారు. బస్సు ప్రమాదంలో త్రిష చెల్లి దివ్య, చరణ్‌లు దుర్మరణం చెందారు. అయితే ఈ విషయం త్రిషకు తెలిస్తే ఎక్కడ దూరమవుతుందోనని భయపడి.. చెల్లి, తమ్ముడు బోనాల పండుగకు పోయారని సర్ది చెప్పారు.
 
పుట్టిన రోజు గుర్తుకు వచ్చింది..
‘ప్రమాదం జరిగింది గుర్తులేదు. ఉదయం చూస్తే ఆస్పత్రిలో ఉన్నా.. అమ్మ, నాన్న, తాత ఎవరూ కన్పించడంలేదు. అప్పడు నా పుట్టిన రోజు గుర్తుకు వచ్చి ఏడ్చా. ఇంతలోనే డాక్టర్లు వచ్చి విషయాలు అడిగి తెలుసుకున్నారు’ కిష్టాపూర్ గ్రామానికి చెందిన ధనూష్‌గౌడ అన్నాడు.

మరిన్ని వార్తలు