కరోనా వ్యాప్తి: మాస్క్‌.. మాఫియా..!

22 Mar, 2020 08:26 IST|Sakshi

సాక్షి, నల్లగొండ టౌన్‌ :  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో మాస్క్‌లకు అధికంగా డిమాండ్‌ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకున్న మాస్క్‌ల వ్యాపారులు పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. దీంతోపాటు చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్‌లను కూడా అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను నిండా ముంచుతున్నారు. గతంతో శానిటైజర్‌ అంటేనే 99 శాతం మందికి తెలియదు. కాని నేడు కరోనా పుణ్యమా అని వ్యాపారులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. శానిటైజర్‌లకు ఇంతకు ముందు పెద్దగా డిమాండ్‌ లేకపోవడంతో వ్యాపారులు వాటిని స్టాక్‌ పెట్టని పరిస్థితి ఉండేది.

నేడు కరోనా వైరస్‌ నియంత్రణ కోసం చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్‌లను వినియోగించాలని సూచిస్తుండడం, మార్కెట్‌లో అంతగా అందుబాటులో లేకపోవడం వల్ల వాటి ధరలకు రెక్కలొచ్చాయి. వాటి సైజును బట్టి రూ. 50 నుంచి రూ.100 వరకు ధరలు ఉంటాయి. ప్రస్తుతం వాటికి ఉన్న డిమాండ్‌ కారణంగా వ్యాపారులు రూ.100 నుంచి రూ.200ల వరకు అమ్ముతున్నారు.

ప్రజల ఆసరాలను, అమాయకత్వాన్ని వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. మాస్క్‌ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. గతంతో ప్రజలు మాస్క్‌లను పెద్దగా వాడకపోయేవారు. నేడు కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు పెద్దఎత్తున మాస్క్‌లను ధరిస్తున్నారు. ప్రజల నుంచి పెత్త ఎత్తున డిమాండ్‌ వస్తుండడంతో మార్కెట్‌లో మాస్క్‌ల కొరత కారణంగా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాస్తవంగా సాధారణ పరిస్థితుల్లో మాస్క్‌ ఒకటి రూ. 5 నుంచి రూ.8 వరకు అమ్ముతుంటారు. నేడు ఉన్న డిమాండ్‌ కారణంగా వాటినే రూ. 25 నుంచి రూ.30 వరకు అమ్ముకుంటూ పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. మాస్క్‌లు సాధారణంగా పూణే నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు.

నేడు దేశ వ్యాప్తంగా మాస్క్‌లను డిమాండ్‌ పెరగడంతో వాటికి తగ్గ దిగుమతి లేకపోవడం వల్ల వాటి కొరత తీవ్రంగా ఏర్పడింది. మాస్క్‌లను కొందరు లోకల్‌గా తయారు చేస్తూ పెద్ద ఎత్తున మార్కెట్‌లో అమ్ముతున్నారు. మాస్క్‌లు, శానిటైజర్‌ల ధరలను నియంత్రించాలి్సన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతోపాటు వాటికి మార్కెట్‌లో పెరిగిన డిమాండ్‌ కారణంగా ధరలను పెద్ద ఎత్తున పెంచి అమ్ముకుంటూ వ్యాపారులు ప్రజలు నిట్టనిలువునా ముంచుతున్నారు. మాస్క్‌ల మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు