డబ్బులిస్తే.. ‘రాసి’పెడతారు! 

19 Mar, 2020 03:01 IST|Sakshi
టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడిన ప్రిన్సిపాల్, సిబ్బంది

ఇంటర్‌ విద్యార్థులకు కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ఎర 

ఒక్కో సబ్జెక్టుకు రూ.8 వేల వరకు వసూలు 

టోలిచౌకి న్యూ మదీన కాలేజీ బాగోతం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని టోలిచౌకి సూర్యనగర్‌ కాలనీలో ఉన్న న్యూ మదీన జూనియర్‌ కాలేజీ (సెంటర్‌ కోడ్‌– 60237) కేంద్రంగా గుట్టుగా సాగుతోన్న మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారాన్ని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. బుధవారం కాలేజీపై దాడిచేసిన ప్రత్యేక బృందం.. కాలేజీ ప్రిన్సిపాల్, ముగ్గురు పరిపాలన విభాగం సిబ్బంది, ఆరుగురు విద్యార్థుల్ని పట్టుకుంది. 

ఇదీ జరుగుతున్న తంతు.. 
ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు బోర్డు నుంచి అనుమతి పొందిన కాలేజీల్లో న్యూ మదీన జూనియర్‌ కాలేజీ ఒకటి. ఇక్కడ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో కొందరికి ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ షోయబ్‌ తన్వీర్‌ కచ్చితంగా పాస్‌ చేయిస్తానంటూ ఎర వేశాడు. ఒక్కో సబ్జెక్టుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఆయా పరీక్షల ప్రశ్నపత్రాలు స్థానిక పోలీసుస్టేషన్లలో ఉంటాయి. ఓఎంఆర్‌ షీట్‌తో కూడిన ఆన్సర్‌ షీట్స్‌ మాత్రం పరీక్ష కేంద్రానికే చేరతాయి. అక్కడ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ వీటిని అందిస్తుంది. వీటిని బోర్డుకు చెందిన ఎగ్జామినర్‌ పర్యవేక్షణలో ఆయా సెంటర్లకు చెందిన వారు సిద్ధం చేస్తారు. దీన్నే తన్వీర్‌ అనుకూలంగా మార్చుకున్నాడు.

ప్రతి ప్రశ్నపత్రంతోనూ జతచేసి ఉండే ఆన్సర్‌షీట్స్‌ బుక్‌లెట్‌ను ముందు రోజు రాత్రే వీళ్లు మార్చేస్తున్నారు. ఓఎంఆర్‌ షీట్‌కు డమ్మీ జవాబుపత్రాన్ని జత చేస్తున్నారు. పరీక్ష రాసేటపుడు విద్యార్థి బుక్‌లెట్‌పై ఉండే ఓఎంఆర్‌ షీట్‌లో క్వశ్చన్‌ పేపర్‌తో పాటు ఈ బుక్‌లెట్‌ నంబర్‌ కూడా వేయాలి. మదీన జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ తమతో ఒప్పందం కుదుర్చుకున్న వారికి ఓఎంఆర్‌ షీట్స్‌తో డమ్మీ బుక్‌లెట్స్‌ ఇస్తున్నాడు. అదే సమయంలో ప్రిన్సిపాల్‌.. అసలు బుక్‌లెట్స్‌ను కాలేజీ అడ్మినిస్ట్రేటివ్‌ సిబ్బంది సయ్యద్‌ కలీముద్దీన్, షబానా బేగం, జాహెదా షరీన్‌కు ఇచ్చి పుస్తకాల్లో చూసి రాయిస్తున్నాడు. ఆయా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలూ వీరికి ఇస్తున్నాడు. పరీక్ష ముగిశాక ఈ అసలు బుక్‌లెట్స్‌ను ఒప్పం దం చేసుకున్న విద్యార్థులకు అందించి, వాటిని ఓఎంఆర్‌ షీట్‌ కు జతచేయిస్తూ దానిపై ఆ బుక్‌లెట్‌ నంబర్‌ వేయిస్తున్నాడు. 

అదుపులో పది మంది.. 
నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దీనిపై పక్కా సమాచారం అందుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం న్యూ మదీన కాలేజీపై దాడి చేసింది. ఆ సమయంలో బుక్‌లెట్స్‌లో పరీక్షలు రాస్తున్న ముగ్గురు సిబ్బందితో పాటు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద లభించిన ఆధారాలను బట్టి ఒప్పందం చేసుకున్న విద్యార్థులైన అహ్మద్‌ నజీర్‌ (సెయింట్‌ జోసఫ్‌ జూనియర్‌ కాలేజీ–టోలిచౌకి), మహ్మద్‌ అహ్మద్‌ హుస్సేన్, మహ్మద్‌ ఇక్బాల్‌ అబ్బాస్, ఫిరాజ్‌ మీర్జా (నియోసిస్‌ జూనియర్‌ కాలేజీ), మహ్మద్‌ రియాన్‌ నజీర్‌ (న్యూ రిలయన్స్‌ జూనియర్‌ కాలేజీ), నిసార్‌ అహ్మద్‌ (నారాయణ జూనియర్‌ కాలేజీ)ను పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు కామర్స్, నలుగురు కెమిస్ట్రీ పరీక్షలు రాయిస్తున్నారని గుర్తించారు. మరో ఇద్దరు విద్యార్థులైన మహ్మద్‌ అలీఖాన్, అబుబకర్‌ అబ్దుల్లా బిన్‌ మహఫూజ్‌ కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారిని టాస్క్‌ఫోర్స్‌ బృందం గోల్కొండ పోలీసులకు అప్పగించింది. ఈ తరహాలో మరికొందరికీ ప్రిన్సిపాల్‌ పరీక్షలు రాయించినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగానూ దర్యాప్తు చేపట్టారు.

యాజమాన్యానికి షోకాజ్‌ నోటీస్‌ 
మూకుమ్మడి మాల్‌ ప్రాక్టీస్‌ ఘటన నేపథ్యంలో న్యూ మదీన జూనియర్‌ కాలేజీ యాజమాన్యానికి ఇంటర్‌ బోర్డు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీలో మాల్‌ప్రాక్టీస్‌ వాస్తవమేనని తేలిందని, దీంతో 8 మందిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులు బుక్‌ చేశా మంది. యాజమాన్యం తమ తప్పిదాన్ని అంగీకరించిన నేపథ్యంలో కాలేజీ అనుబంధ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని యాజమాన్యానికి నోటీసు జారీ చేసినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి
సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు