ఘనంగా సామూహిక వివాహాలు 

13 Mar, 2018 09:10 IST|Sakshi
నూతన వధూవరులు

బజార్‌హత్నూర్‌(బోథ్‌): మండలంలోని భూతాయి(బి) గ్రామపంచాయతీ పరిధి వంజర్‌భూతాయిలో సోమవారం గ్రామాభివృద్ధి కమిటీ, హనుమాన్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఎనిమిది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామ పెద్ద పాటిల్‌ పడ్‌ మాట్లాడుతూ గ్రామంలో 1992 నుంచి సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో పేద, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారేనని, ఒక వివాహం చేయాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చి సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించామని, 25 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని  కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఒక సంవత్సరంలో గ్రామంలో ఎన్ని సంబంధాలు కుదిరినా వాటన్నింటికీ ఒక తేదీ నిర్ణయించి సామూహిక వివాహాలు జరిపిస్తామని, మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఒక్కో జంటకు రూ.20వేల నుంచి రూ.30 వేలు తీసుకుని మొత్తం రూ.2లక్షలతో టెంట్లు, భోజన ఏర్పాట్లు, బ్యాండుమేళాలు, పెండ్లికి పూలదండలు, బ్రహ్మణుల ఖర్చులు అన్నింటినీ అందులో నుంచే ఖర్చు చేస్తామని తెలిపారు. ఒక్కో జంటకు రూ.30 వేలతో వివాహం చేసే వెసులుబాటు ఉంటుందని, ఆ కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా గ్రామస్తులందరూ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దినేశ్‌ ముండే, హరిచంద్‌ ముండే, ప్రహ్లాద్‌ పడ్, వినాయక్‌ ముండే, ప్రభాకర్‌ ముండే హనుమాన్‌ యూత్‌ సభ్యులు ఈశ్వర్, సంతోష్‌ పడ్, మారుతీ, నాగనాథ్, శివరాజ్, మాధవ్‌ పాల్గొన్నారు. 

                       పెళ్లికి హాజరైన బంధువులు, గ్రామస్తులు

మరిన్ని వార్తలు