కిటికీ గ్రిల్స్ తొలగించి భారీ చోరీ

23 Feb, 2015 03:38 IST|Sakshi

- 53 తులాల బంగారం, కిలోవెండి, రూ. 2 లక్షల నగదు అపహరణ   
- వివరాలు సేకరించిన ఏసీపీ రఫీక్, క్లూస్ టీం
- కుటుంబీకులు ఇంట్లో నిద్రిస్తుండగానే చొరబడిన దొంగలు

జవహర్‌నగర్: కుటుంబీకులు ఇంట్లో నిద్రిస్తుండగానే దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి చొరబడిన దొంగలు 53 తులాల బంగారం, కిలో వెండితో పాటు రూ. 2 లక్షల నగదు అపహరించుకుపోయారు.
 
ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ డివిజన్ పరిధిలోని యాప్రాల్ తులసి గార్డెన్‌లోని డూప్లెక్స్ నంబర్ 53లో నివాసముంటున్న ఓ వ్యాపారవేత్త కంపెనీ పనిమీద శుక్రవారం ఢిల్లీకి వెళ్లాడు. ఆయన భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లోని పైగదిలో నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి కిందిపోర్షన్ వెనక భాగంలోని కిటికీ గిల్స్ తొలగించి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఆమె కింది పోర్షన్‌లో ఉన్న బెడ్‌రూంలోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. ఇంట్లో ఉన్న 53 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ. 2 లక్షల నగదు పాటు విలువైన సామగ్రి చోరీ అయిందని ఆమె గుర్తించింది.  
 
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ, క్లూస్‌టీం
ఆదివారం ఆలస్యంగా సమాచారం అందుకున్న అల్వాల్ ఏసీసీ రఫీక్, సీఐ వెంకటగిరి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి ఇంటి పరిసరాల్లో పరిశీలించారు. స్థానికులే చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా పూర్తి వివరాలు వెల్లడించేందుకు బాధితులు నిరాకరించారు. దాదాపు 100 డూప్లెక్స్ ఇళ్లు ఉన్న తులసి గార్డెన్‌లో సీసీ కెమెరాలు అసలే లేవు. ఈమేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు