మ్యాచింగ్‌ మాస్క్‌..

27 May, 2020 08:05 IST|Sakshi

మార్కెట్లో వెరైటీ మాస్కుల జోరు 

బ్రాండెడ్, డిజైనర్‌ ఉత్పత్తుల విక్రయం

మ్యాచింగ్‌కే ఫ్యాషన్‌ ప్రియుల ప్రాధాన్యం

కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అంటున్నారు నగరవాసులు. కరోనా నుంచి కేర్‌ కోసం కావచ్చు.. కనువిందు చేసే ఏదైనా ఫ్యాషన్‌లో ఇమిడిపోవాల్సిందే అంటున్నారు. మాస్క్‌లు జీవితంలో భాగం కావాలని చెబుతుంటే.. మా వస్త్ర ధారణకు అతికినట్టుగా అవి సరిపోవాలని ఫ్యాషన్‌ ప్రియులు కోరుతున్నారు. దీనికి ప్రసిద్ధ బ్రాండ్లతో పాటు పలువురు డిజైనర్లు మ.. మ.. మాస్క్‌ అంటూ కోరస్‌ పాడుతున్నారు.    

  సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ఫ్యాషన్‌ని అప్‌ టు డేట్‌గా ఫాలో అయ్యేవారు తమ అవుట్‌ ఫిట్‌కు తగ్గట్టు వీటిని మ్యాచింగ్‌గా ఎంచుకుంటున్నారు. దీంతో కస్టమైజ్డ్‌ మాస్కులకు డిమాండ్‌ పెరిగింది. ప్రముఖ భారతీయ డిజైనర్‌ పాయల్‌ సింఘాల్‌ మాస్కుల తయారీకి శ్రీకారం చుట్టారు. మాస్కులు అనేవి తమకు భవిష్యత్‌లో కూడా తమ ఉత్పత్తుల జాబితాలో ఓ విభాగంగా చోటు చేసుకుంటాయని ఆమె అంచనా వేస్తున్నారు. మాస్కులు ఇప్పుడు అవసరంగా మారాయని, ప్రతి ఒక్కరూ వాటిని ధరించాల్సిందే కాబట్టి ఇవి ఒక ట్రెండ్‌గా మారనున్నాయన్నారు.  

బ్రాండెడ్‌.. ట్రెండ్‌..
ముఖాన్ని కవర్‌ చేసుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా.. అంతకుమించి తప్పనిసరిగా మారిపోవడంతో  ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ కూడా మాస్కులపై దృష్టి సారించాయి. వెరైటీ ప్రింట్స్, డిజైన్స్‌లలో కస్టమర్లకు ఎంపిక అవకాశాలను పెంచుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ పీటర్‌ ఇంగ్లాండ్, అలెన్‌ సోలీ, లూయిస్‌ ఫిలిప్, వ్యాన్‌ హ్యూసన్‌ కూడా కాటన్‌ మాస్కులను లాంచ్‌ చేశాయి. ఐదు మాస్కులు ఉండే ఒక ప్యాక్‌కి రూ.500 చొప్పున ఇవి అందిస్తున్నాయి. రూ.100 నుంచి రూ.500 దాకా పలు ధరల్లో కాంబో ప్యాక్స్‌లో కూడా అందిస్తున్నారు. మరోవైపు చొక్కాల ఉత్పత్తికి పేరొందిన జోడియాక్‌ క్లాతింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ కొత్త రకం చొక్కాలను కాంప్లిమెంటరీ మ్యాచింగ్‌ మాస్కులతో సహా అందుబాటులోకి తెచ్చింది. డబుల్‌ లేయర్డ్, వాషబుల్, రీ యూజబుల్‌ మాస్క్‌ని ఫ్యాబ్‌ ఇండియా రూపొందించింది. రూ.100కి మూడు మాస్కులు ఉన్న ప్యాక్‌ అలాగే రూ.150కి ఐదు మాస్కులున్న ప్యాక్‌ అందిస్తోంది. ‘డిమాండ్‌ను బట్టి ఉత్పత్తి పెంచుదామని అనుకుంటున్నాం. తక్కువ ధరలో లభించే సురక్షితమైన ఉత్పత్తి ఇది. మా సంస్థ మీద ఆధారపడిన చేనేత కళాకారులకి జీవనాధారంగా సహకరిస్తోంది.  

చిన్నారులకు మరో రెండు సైజుల్లో..
ఫ్యాబ్‌ ఇండియా ప్రతినిధి త్వరలో చిన్నారులకు మరో రెండు సైజుల్లో మాస్కులు తయారు చేయాలని, అలాగే సంస్థలకు, కార్పొరేట్స్‌కి పెద్ద మొత్తంలో బల్క్‌ ఆర్డర్స్‌పై సరఫరా చేయాలని సంస్థ ఆశిస్తోంది. సురక్షితమైన పద్ధతులు పాటించడం అలవాటు చేసుకోండని ప్రజలకు గుర్తు చేసేవే మాస్కులు. అందుకే మేం మాస్కులకు  ధర చెల్లించమనడం లేదు. కస్టమర్స్‌ కొన్న ప్రతి షర్ట్‌కి ఒక మాస్క్‌ని ఉచితంగా పొందవచ్చు. మా కస్టమర్ల శ్రేయస్సు కోసమే అంటున్నారు జోడియాక్‌ క్లోతింగ్‌ కంపెనీ ప్రతినిధి. నగరానికి చెందిన నీరూస్‌ బ్రాండ్‌ కూడా నాన్‌ సర్జికల్‌ ఫేస్‌ మాస్క్‌ను రూపొందించి విడుదల చేసింది.  

జిప్‌ మాస్క్‌.. సేఫ్టీ టాస్క్‌..
సేఫ్టీ కోసం మాస్కులు ధరించడం ఇక లైఫ్‌లో భాగం కానుంది. ఇందులో కూడా స్టైల్‌ మిక్స్‌ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇటీవలే నేను తయారు చేసిన జిప్‌ మాస్క్‌కి మంచి డిమాండ్‌ వచ్చింది. ఎప్పటి నుంచో వినియోగిస్తున్న మంకీ క్యాప్, ముస్లిం మహిళలు వాడే స్కార్ఫ్‌ని స్ఫూర్తిగా తీసుకుని వర్కింగ్‌ ఉమన్‌కి రెడీ టు వేర్‌గా దీన్ని తయారు చేశా. బైక్స్‌ మీద ప్రయాణాలు, రకరకాల పనులు చేసేవారికి ఈ మాస్క్‌ చాలా సౌకర్యంగా ఉంటుంది. వింటర్‌లో వినియోగించే మంకీ క్యాప్స్‌.. బాయ్స్‌ టీ షర్ట్స్‌కి హెయిర్‌ కవర్‌గా వచ్చే హుడ్‌ని స్ఫూర్తిగా తీసుకుని బాయ్స్‌ మాస్కు తయారు చేశా. ఈ మాస్క్‌కి ఫ్రంట్‌ సైడ్‌ ఉండే జిప్‌ తీసేస్తే రెగ్యులర్‌ క్యాప్‌లా కూడా వినియోగించుకోవచ్చు. మల్టీ సైజ్‌కి సరిపోవాలంటే కాటన్‌ స్ట్రెచ్‌ అవదు కాబట్టి చేనేత ఫ్యాబ్రిక్‌తో రూపొందిన ఈ మాస్క్‌లో 90శాతం కాటన్‌ 10శాతం స్ట్రెచ్‌ ఫ్యాబ్రిక్‌ ఉంటుంది. వీటిని రానున్న వింటర్, వర్షాకాలానికి కూడా వినియోగించుకోవచ్చు. విభిన్న రకాల సింబల్స్‌తో, అన్ని వయసుల వారికి, టేస్ట్‌కి తగ్గట్టుగా తయారు చేస్తున్నా.    – హేమంత్‌శ్రీ, ఫ్యాషన్‌ డిజైనర్‌

మరిన్ని వార్తలు