అమ్మ పదిలం

17 Jul, 2020 04:57 IST|Sakshi

జాతీయ సగటు 113కాగా తెలంగాణలో 63 మాత్రమే

కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత మనమే

ఐరాస లక్ష్యాన్ని మొదటిసారిగా సాధించిన ఘనత

కేసీఆర్‌ కిట్‌తోనే సాధ్యమైందంటున్న వైద్య, ఆరోగ్యశాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మాతృత్వపు మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్‌) గణనీయంగా తగ్గింది. దేశంలో అత్యంత తక్కువ ఎంఎంఆర్‌ నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. 2016–18 ఏళ్ల మధ్య దేశంలో నమోదైన ఎంఎంఆర్‌పై కేంద్ర ప్రభుత్వం గురువారం స్పెషల్‌ బులెటిన్‌ విడుదల చేసింది. జాతీయస్థాయి సగటు ఎంఎంఆర్‌ లక్షకు 113గా ఉండగా అందులో అత్యంత తక్కువ ఎంఎంఆర్‌ నమోదైన రాష్ట్రం కేరళ (43). ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (46), తమిళనాడు (60), తెలంగాణ (63) నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సగటు ఎంఎంఆర్‌ 67గా నిలిచింది. అస్సాంలో ఎంఎంఆర్‌ అత్యంత ఎక్కువగా 215గా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 

గతం కంటే తక్కువ...
రాష్ట్రంలో ఎంఎంఆర్‌ క్రమంగా తక్కువగా నమోదవుతోంది. 2015–17 మధ్య ఎంఎంఆర్‌ 76గా ఉంటే ఇప్పుడు 63కు తగ్గింది. తెలంగాణలో 2017లో ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌తో ఎంఎంఆర్‌ తగ్గిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ కిట్‌ ద్వారా గర్భిణులకు ప్రభుత్వం రూ. 12 వేల నుంచి రూ. 13 వేల వరకు ఇస్తుండటం తెలిసిందే. అలాగే తల్లీబిడ్డల సంరక్షణకు వివిధ రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తోంది. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. అలాగే గతంలో ఇళ్ల వద్ద జరిగే ప్రసవాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఎంఎంఆర్‌ తగ్గింది. కేసీఆర్‌ కిట్‌ ప్రారంభానికి ముందు అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హయాంలో ప్రసూతి దవాఖానాల్లో ప్రారంభించిన లేబర్‌ రూంలు, ఇతర మౌలిక సదుపాయాల వల్ల కూడా ఎంఎంఆర్‌ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 

ఐరాస లక్ష్యాన్ని చేరుకున్నాం
15–49 ఏళ్ల వయసులోని మాతృత్వపు మహిళల్లో జరిగే మరణాలను ఎంఎంఆర్‌ కింద లెక్కిస్తారు. గర్భధారణ, ప్రసవం లేదా గర్భస్రావం సమయంలో జరిగే మరణాలను ఎంఎంఆర్‌గా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ‘మాతృత్వపు మరణం అంటే గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ఆ తర్వాత 42 రోజుల్లోపు ఏదైనా కారణంతో చనిపోవడం’. ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్దేశించిన సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీ) ప్రకారం ఎంఎంఆర్‌ను 70కన్నా తగ్గించడంకాగా దీన్ని మొదటిసారి రాష్ట్రం సాధించడం విశేషమని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు