నెట్టింట్లో లెక్కలు!

11 May, 2019 07:02 IST|Sakshi

పిల్లల మెదడుకు మేత 

వేసవిలో ఇంట్లోనే సరదా ఆట

 సాక్షి,సిటీబ్యూరో: ఎండల తీవ్రత పెరిగింది. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో వారు ఎక్కడికైనా బయటికి వెళ్లి ఆడుకోవాలని చూస్తుంటారు. ఇంతటి ఉష్ణోగ్రతల్లో వారు బయటికి వెళితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. ఇప్పటి వరకు బడిలో గడిపిన వీరిని ఇంటి పట్టున కూర్చోపెట్టడం ఓ పట్టాన సాధ్యం కాదు. ఈ క్రమంలో వారికి లెక్కలపై ఆసక్తి, అనురక్తి కలిగించేందుకు ఇంటర్‌నెట్‌లో చక్కని అవకాశాలు ఉన్నాయి. కొన్ని వెబ్‌సైట్లు కేవలం పిల్లకు మేథమెటిక్స్‌ను అర్థవంతంగా నేర్పించేందుకు అనువుగా రూపొందించారు. వీటిని సెల్‌ఫోన్‌లో సైతం ఓపెన్‌ చేసి పిల్లలతో ప్రాక్టీస్‌ చేయించవచ్చు. అయితే, ఈ సైట్లలో కొన్ని ఉచిత సేవలు అందిస్తుంటే.. మరికొన్నింటికి డబ్బులు చెల్లించాలి. అయితే, చాలా వరకు వెబ్‌సైట్లు కొన్ని రోజులు ‘ఫ్రీట్రైల్‌’ కూడా అందిస్తున్నాయి. అలాంటి నెట్‌ వేదికల సమాచారమే ఈ కథనం.  

నిపుణులు ఏమంటున్నారంటే..
వేసవి సెలవుల్లో చిన్నారులకు వీలైనంత వరకు తమ కనుసన్నల్లో ఈ పేజీలు తెరిచే విధంగా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. వారికి తెలియని భావనలు విడమరచి చెప్పాలి. వేసవి సెలవుల్లో ఎండలో తిరగకుండా ఇలాంటి పాఠ్యాంశ సంబంధ విషయాలను నేర్చుకుంటే విద్యార్థికి మంచిది. తరగతి గదిలో మిగతా విద్యార్థుల కన్నా చురుగ్గా ఉంటూ ఉపాధ్యాయుడి మెప్పు పొందడం సహా విజ్ఞానం సంపాదిస్తారని చెబుతున్నారు.   

 www.funbrain.com
ఈ వెబ్‌ పేజీలో శోధిస్తే కనీసం 17 రకాల ఆటల ద్వారా లెక్కలు నేర్చుకోవచ్చు. చిన్న చిన్న కూడికలు తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు సహా పలు ఆటలను ఆసక్తికరంగా దృశ్యరూపకంగా ఈ సైట్‌లో పొందుపరిచారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థుల మానసిక స్థాయిని అంచనా వేసి వారి స్థాయికి తగ్గట్టు ఈ లెక్కలు ఉంటాయి. పిల్లలకు ఈ వెబ్‌సైట్‌ను పరిచయం చేస్తే వారు ఇంట్లోనే ఉండడంతో పాటు ఈ సెలవుల్లో కొత్తగా లెక్కలపై పట్టు సాధించేందుకు వీలుంది. 

 www.coolmath.com
ప్రాధమిక తరగతులు చదివే పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఈ సైట్‌ను తీర్చిదిద్దారు. ఉన్నత తరగతుల్లో పాఠ్యపుస్తకాలలో తారసపడే పలు ఎక్కలను సంబంధించిన సమాచారం ఎంతో ఆసక్తిగా స్వయంగా ప్రాక్టీస్‌ చేస్తూ నేర్చుకునేలా లెక్కలు ఉన్నాయి. ఈ వెబ్‌పేజీలోకి వెళితే అనేకానేక ఆటలతో లెక్కలు నేర్చుకోవచ్చు.

www.easymaths.org
అబాకస్‌.. ఇటీవల బహుళ ప్రచారం పొంది చలామణిలో ఉన్న గణిత భావనల్లో ప్రప్రథమ స్థానంలో ఉంది. గణితానికి సంబంధించిన చతుర్విధ (కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం) ప్రక్రియలను సులువుగా, వేగంగా నేర్చుకోవడానికి అబాకస్‌ బాగా దోహదపడుతుంది. బాల్యం నుంచే నేర్పిస్తే భవిష్యత్‌లో గణితంతో ఆటలాడుకోవచ్చని పలువురు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నిపుణులతో అబాకస్‌ నేర్పిస్తున్నారు. ‘ఈజీ మాథ్స్‌’ వెబ్‌సైట్‌లో అలాంటి అబాకస్‌ను సులువుగా ఇంట్లోనే నేర్చుకోవచ్చు.  

www.figurethis.org
జాతీయ గణిత ఉపాధ్యాయ మండలి నిర్వహిస్తున్న ఇంటర్‌నెట్‌ పేజీ ఇది. ఇందులో ‘ఫిగర్‌ దిస్‌’ అన్న ఆటతో పాటు కుటుంబాలు పాఠశాల, గణితం, కుటుంబాలు ఇంటిపని, ప్రోత్సాహం, గణితం సాహిత్యం, ఇతర వనరులు, అన్న ఆరు రకాల వివరాల పేజీలున్నాయి. ఈ పేజీలో పిల్లలతో పాటు పెద్దలకు కావాల్సిన సమాచారం పొందవచ్చు.  

www.mathscat.com
చాలామంది విద్యార్థులకు లెక్కలంటే భయం ఉంటుంది. అయితే, ఈ వెబ్‌ పేజీలో గణితానికి సంబంధించి కావాల్సినంత సమాచారం పొందవచ్చు. ఇందులో లెక్కలు ప్రాజెక్టు రూపంలో ఉంటాయి. ప్రతి ప్రాజెక్టు వర్కుతో ఎంతో కొంత విజ్ఞానం పొందవచ్చు. అనేక సరదా ఆటలు ఆడుకోవచ్చు. తను పుట్టిన తేదీ ఆధారంగా వయసును గంటలు, నిమిషాలు.. సెకన్లు సహా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఆటలు ఎన్నో ఈ పేజీలో పొందుపరిచారు. కొత్తకొత్త ఆలోచనలు సృజనాత్మకత ఆపాదించుకునే ప్రాజెక్టులు, ప్రయోగాలు ఎన్ని చేయవచ్చో వివరిస్తుంది.

www.aaamath.com 
నేటి తల్లిదండ్రులు తమ పల్లలను మూడేళ్ల వయసులోనే అంగన్‌వాడీ కేంద్రానికో లేదా ప్లేస్కూల్‌కో పంపిస్తున్నారు. ఇలాంటి పిల్లలు కూడా చక్కని పాఠాలు కథలుగా అందిస్తుంది ఈ సైట్‌. ఎల్‌కేజీ నుంచి ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు అర్థమయ్యే రీతిలో లెక్కలు పొందుపరిచారు. అభ్యాసం చేయడం, సమస్యను పరిష్కరించడం, అది సరైనదేనా కాదా అన్న మదింపు వెంటవెంటనే తెర మీద కనిపిస్తుంది. పిల్లలు కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకునేలా ఉన్నాయి.

మరిన్ని వార్తలు