కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

2 May, 2018 09:57 IST|Sakshi
ర్యాలీలో కోలాటం ఆడుతున్న బాలికలు

సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి

సీఐటీయూ ఆధ్వర్యంలోమే డే వేడుకలు

మానుకోటలో భారీ ర్యాలీ

నెహ్రూసెంటర్‌(మహబూబాబాద్‌) : కార్మిక వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. మంగళవారం మానుకోట జిల్లా కేంద్రంలో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవమైన మే డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో ఎర్రజెండాలను ఎగురవేశారు. ఎర్ర చొక్కాలు, చీరలు ధరించిన వందలాది మందితో పట్టణంలోని గాంధీపార్కు నుంచి పట్టణ ప్రధాన వీధుల్లో కార్మికులు, మహిళలు నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి సీపీఐ పార్టీ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం ఏఐటీయూసీ నిర్వహించిన ఉమ్మడి సభ సీపీఐ పట్టణ అధ్యక్షుడు పెరుగు కుమార్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రేషపల్లి నవీన్‌ అధ్యక్షతన జరిగింది.

ఈ సభకు ముఖ్యఅతిథిగా బి.విజయసారథి పాల్గొని మాట్లాడుతూ చికాగో నగరంలో కార్మికులకు పనిగంటలు తగ్గించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికులు అమరులయ్యారని తెలిపారు. అదే స్ఫూర్తి నుంచి నేటి వరకు అనేక పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కార్మికుల హక్కులు సాధించుకునేందుకు చేసే పోరాటాలే మేడే అని అన్నారు. కార్మికులు హక్కులను హరిస్తూ, దేశవ్యాప్తంగా ప్రజలపై దాడులు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు

 ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కట్లోజు పాండురంగాచారి, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, నాయకులు చింతకుంట్ల యాకాంబ్రం, నర్రా శావణ్, వెలుగు శ్రావణ్, కేసుదాసు రమేష్, దాస్యం రామ్మూర్తి, ఎండీ.ఫాతిమా, మంద శంకర్, జక్కరయ్య, హల్య, సోమయ్య, భావాని, శ్రీను, శంకర్, కిష్టయ్య, పాల్, మహిమూద్, విజయలక్ష్మి, సుధాకర్, శ్రీను పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు