విద్యుత్‌ బిల్లు.. ముందే చెల్లిస్తే రిబేటు! 

18 Nov, 2019 02:32 IST|Sakshi

బిల్లుల చెల్లింపులు ప్రోత్సహించేందుకు ప్రతిపాదించే చాన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : విద్యుత్‌ బిల్లులను ముందుగానే చెల్లించే వినియోగదారులకు చార్జీలను తగ్గించాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు రిటైల్‌ టారిఫ్‌ ఖరారు నిబంధనలను సవరించాలని సూచించింది. 2020–21లో అమలు చేయనున్న విద్యుత్‌ టారిఫ్‌ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు త్వరలో సమర్పించనున్నాయి. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ముందస్తు బిల్లుల చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రిబేటును ప్రతిపాదించే అవకాశాలున్నాయి.

వర్కింగ్‌ కాపిటల్‌ భారం తగ్గుదల.. 
గత ఆగస్టులో కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అవసరమైన విద్యుత్‌ కొనుగోళ్ల కోసం డిస్కంలు కనీసం ఒకరోజు ముందు ఉత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపులు జరపాలని ఆదేశించింది. దీంతో డిస్కంలు వ్యయప్రయాసలు పడుతూ ముందస్తు చెల్లింపులు జరుపుతున్నాయి. దీంతో ఉత్పత్తి కంపెనీలపై వర్కింగ్‌ కాపిటల్‌ భారం తగ్గుతోంది.  

జనరేటింగ్‌ టారిఫ్‌ తగ్గించాలి.. 
వర్కింగ్‌ కాపిటల్‌ తగ్గుతున్న నేపథ్యంలో ఉత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించే జనరేటింగ్‌ టారిఫ్‌ను తగ్గించాలని తాజాగా కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ సూచించింది. ఉత్పత్తి కంపెనీల వర్కింగ్‌ కాపిటల్‌ భారం తగ్గితే ఆ మేరకు డిస్కంలకు పూర్తిస్థాయి పరిహారం అందించడానికి ప్రస్తుత రిబేటు విధానం సరిపోదని, కొత్త విధానాన్ని ఈఆర్సీ రూపొందించాలని కోరింది. అదే విధంగా వినియోగదారులూ ముందస్తుగా విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తే డిస్కంలకు వర్కింగ్‌ కాపిటల్‌ భారం తప్పనుంది. ఆ మేరకు ముందస్తుగా చెల్లింపులు జరిపితే రిబేటు అందించేందుకు వారి విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని కోరింది. 

మరిన్ని వార్తలు