లాక్‌డౌన్‌ సంకల్పాన్ని దెబ్బ తీయొద్దు

21 Apr, 2020 11:38 IST|Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తికి ఆస్కారమివ్వొద్దు  

రోడ్లపై భోజనం, నిత్యావసరాలను ఇష్టారీతిగా పంపిణీ చేయొద్దు

జీహెచ్‌ఎంసి, పోలీసు అధికారుల ద్వారానే వీటిని అందించాలి   

కార్పొరేటర్లు సైతం ఈ పద్ధతినేపాటించాలి  

దాతలకు, ఎన్జీఓలకు జారీ చేసిన పాస్‌లు ఇకనుంచి చెల్లవు   

యాచకులకు ఆహారాన్ని షెల్టర్‌హోంలలోనే ఇవ్వాలి

నేటినుంచి అమలు చేయాలన్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌

లక్డీకాపూల్‌:  రోడ్లపై అన్నదానాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తుండటంతో లాక్‌డౌన్‌సంకల్పం దెబ్బ తింటోందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటంతో కరోనా వైరస్‌ సోకే ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు, కార్పొరేటర్లు గమనించాలని కోరారు.  ఈ నెల 21 నుంచి భోజనం, నిత్యావసరాలను పంపిణీ చేయాలనుకునే స్వచ్ఛంద సంస్థలు, దాతలు తప్పనిసరిగా జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులకు సమాచారమిస్తే, వారే వాటిని సేకరించి అవసరమైనపేదలకు, యాచకులకు, వలస కార్మికులకు అందజేస్తారని తెలిపారు. అన్నదానం, నిత్యావసరాల పంపిణీకి స్వచ్ఛంద సంస్థలు, దాతలకు జారీ చేసిన పాస్‌లుఇక నుంచి చెల్లవని ప్రకటించారు.

కార్పొరేటర్లు కూడా  వాటిని అధికారులకు అప్పగించాలని సూచించారు.  నిర్వాసితులు, అనాథలు, యాచకుల సంరక్షణకు జీహెచ్‌ఎంసీ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 25 షెల్టర్‌హోంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో 1,428 మందికి ప్రస్తుతం ఆశ్రయం కల్పించి, అన్నపూర్ణ పథకం ద్వారా భోజనం పెడుతున్నట్లు తెలిపారు. కాగా.. స్వచ్ఛంద సంస్థలు, దాతలు భోజనం, ఇతర నిత్యావసరాలను ఇవ్వాలనుకుంటే ముందస్తుగా షెల్టర్‌ హోంలలో ఉన్న వారికి అధికారుల ద్వారా అందజేయాలని సూచించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో రోడ్లపై తలదాటుకుంటున్న యాచకులను గుర్తించి షెల్టర్హోంలకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు మేయర్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు