ప్రతి 5 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖానా: బొంతు

12 May, 2017 00:17 IST|Sakshi
ప్రతి 5 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖానా: బొంతు

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబా ద్‌లో ప్రతి 5 వేల మంది జనాభాకు ఒక బస్తీ దవాఖా నాను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బొంతు రామ్మోహన్‌ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మోహల్లా క్లినిక్‌లను సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న ఈ క్లీనిక్‌లను హైదరాబాద్‌లో చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

 దీనికి సంబంధించి త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతి 5 వేల మంది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్తీ దవాఖానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 23 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్‌ప్లాంట్‌ను మేయర్‌ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి, రామగుండం, కొత్తగూడెం, ఖమ్మం మేయర్ల బృందం సందర్శించింది. ఈ ప్లాంట్‌లో అవలంబిస్తున్న కొత్త విధానాలను, సాంకేతిక పద్ధతులను హైదరాబాద్‌ ప్లాంట్‌లో కూడా అమలు చేస్తామని ఆయన తెలిపారు.
 

మరిన్ని వార్తలు