ఎంబీబీఎస్‌ సీట్లు.. 3,500

3 Jun, 2018 01:14 IST|Sakshi

ఈ ఏడాది కొత్తగా వచ్చినవి 450.. కోత పడినవి 150

‘సిద్దిపేట’, ‘అయాన్‌’, ఆర్‌వీఎం కాలేజీల్లో సీట్ల భర్తీకి ఓకే

మల్లారెడ్డి కాలేజీకి అనుమతి నిరాకరించిన ఎంసీఐ  

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్య డిగ్రీ కోర్సుల భర్తీ ప్రక్రియకు కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏర్పాట్లు మొదలుపెట్టింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు వచ్చే వారంలో వెల్లడి అవుతాయని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టేలా కాళోజీ వర్సిటీ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

రాష్ట్రంలోని వైద్య విద్య సీట్ల విషయంలో ఈ ఏడాది మిశ్రమంగా ఉంది. కొత్తగా మూడు కాలేజీలకు అనుమతి వచ్చిందనేది విద్యార్థులకు సంతోషం కలిగిస్తుండగా... గత ఏడాది ఉన్న వాటిలో 150 సీట్లకు కోత పడటం ఆందోళన కలిగిస్తోంది. వైద్య విద్య కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు భారత వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి తప్పనిసరి. కాలేజీల్లోని వసతులు, బోధన సిబ్బంది, కాలేజీకి అనుబంధంగా ఉండే ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య వివరాలను పరిశీలించిన తర్వాతే ఈ అనుమతులు ఇస్తుంది.

2018–19 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి మొత్తం 3,500 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్‌ సీట్లున్నాయి. ఎంబీబీఎస్‌ సీట్లకు సంబంధించి 8 ప్రభుత్వ కాలేజీల్లో 1,250 సీట్లు... 16 ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో 2,250 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌ సీట్లకు సంబంధించి ఏకైక ప్రభుత్వ కాలేజీలో వంద సీట్లు, 12 ప్రైవేట్‌ కాలేజీల్లో 1,040 సీట్లున్నాయి.  

కొత్తగా 450 సీట్లు...
సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్లు, రంగారెడ్డి జిల్లా కనకమామిడిలో అయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ కాలేజీలో 150 సీట్లకు ఎంసీఐ కొత్తగా అనుమతి ఇచ్చింది. సరైన వసతులు లేని కారణంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఆర్‌వీఎం కాలేజీకి వరుసగా రెండేళ్లు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఎంసీఐ గత ఏడాది ప్రకటించింది.

అయితే కాలేజీ యాజమాన్యం అనుమతి కోసం చేసిన ప్రయత్నం ఫలించడంతో ప్రస్తుత ఏడాదిలో 150 సీట్ల భర్తీకి ఎంసీఐ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 450 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

150 సీట్ల కోత...  
ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం వసతులు లేకపోవడం, బోధన సిబ్బంది, ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య నమోదులో లోపాల కారణంగా 3 కాలేజీలకు ఈ ఏడాది అనుమతి రాలేదు. 150 సీట్లున్న మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కాలేజీలో 2018–19, 2019–20 విద్యా సంవత్సరాల్లో సీట్ల భర్తీకి అనుమతిని నిరాకరించింది.

అలాగే గత సంవత్సరం అనుమతి నిరాకరించిన మల్లారెడ్డి మహిళా వైద్య కాలేజీ, మహావీర్‌ వైద్య కాలేజీలకు ఈ ఏడాది కూడా సీట్ల భర్తీకి అవకాశం రాలేదు. ఈ రెండు కాలేజీల్లో కలిపి మొత్తం 300 సీట్లున్నాయి.

మరిన్ని వార్తలు