ఎంబీబీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ నిలిపివేత 

8 Aug, 2019 03:00 IST|Sakshi

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ 

కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక ఆధారాలను బట్టి జనరల్‌ కేటగిరీ సీట్లను భర్తీ చేశాక రిజర్వేషన్‌ కోటా సీట్లను భర్తీ చేయలేదని స్పష్టమవుతోందని, దీంతో ఇప్పటికే జరిగిన రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ సంజీవ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ పి.కేశవరావుల ధర్మాసనం ఈ మేరకు స్టే ఉత్తర్వులు ఇచ్చింది.

రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు నష్టం కలిగేలా రెండో విడత కౌన్సెలింగ్‌ జరిగిందని పేర్కొంటూ ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఎన్‌.భావన మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను బుధవారం హైకోర్టు విచారించింది. తొలి విడతలాగే రెండో విడత కౌన్సెలింగ్‌ను జీవో ప్రకారం నిర్వహించారో లేదో తెలపాలని, పిటిషనర్ల ఆరోపణలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ లను ఆదేశించింది. వర్సిటీలో ఏం జరుగుతుందో ప్రభుత్వం పట్టించుకోవాలని, రెండో విడత కౌన్సెలింగ్‌ జీవో నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అనిపిస్తోందని వ్యాఖ్యానించింది.   

రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు నష్టం.. 
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదిస్తూ.. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీ సక్రమంగానే జరిగిందని.. రెండో విడతలో మాత్రం రిజర్వేషన్‌ కేటగిరీ సీట్ల భర్తీ తర్వాత జనరల్‌ కేటగిరీ సీట్లను భర్తీ చేశారని పేర్కొన్నారు. దీంతో ప్రతిభ ఉన్న రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులు నష్టపోయారని చెప్పారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో ముందుగా జనరల్‌ కేటగిరీ సీట్లను భర్తీ చేశారా లేక రిజర్వేషన్‌ సీట్లను భర్తీ చేశారా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు స్పందిస్తూ.. ప్రవేశాలకు జీవోలు 550, 114 ఉన్నాయని, వివరాలు ఇచ్చేందుకు గడువు కావాలని కోరారు. తదుపరి విచారణను హైకోర్టు 13వ తేదీకి వాయిదా వేసింది.   

>
మరిన్ని వార్తలు