పక్షులకు ప్రాణదాత!

15 Jan, 2019 11:16 IST|Sakshi
త్రిమూర్తి పిళ్లై

వినూత్నంగా సేవలందిస్తున్న త్రిమూర్తి పిళ్లై

ఆదాయంలో సగం పక్షులు, జంతువుల కోసం ఖర్చు

సేవా కార్యక్రమాలతో ప్రశంసలు అందుకుంటున్న మెకానిక్‌

నాంపల్లి: పతంగులు పక్షుల పాలిట శాపంగా మారాయి. చైనా మాంజాలతో పతంగులు ఎగురవేయడంతో తెగిపడిన మాంజాలకు చిక్కుకుంటూ గద్దలు, కాకులు, పావురాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. కాళ్లను, రెక్కలను పోగొట్టుకుంటున్నాయి. ఆకాశంలో ఎగరలేక కిందపడ్డ ఓ గద్ద ఒకానొక రోజు నాంపల్లి రోడ్లపై కనిపించింది. పైకెగరలేని గద్దను నాంపల్లి వ్యాయామశాల వద్ద నివాసం ఉండే టూ వీలర్‌ మెకానిక్‌ సుబ్బారావు కుమారుడు త్రిమూర్తి  పిళ్లై దగ్గరకు తీసుకున్నారు. మాంజా (దారం) చుట్టుకుని గాయపడ్డ గద్దకు చికిత్సలు అందించారు. నెల రోజుల పాటు నాంపల్లి మార్కెట్‌లో చికెన్‌ కలేజాను కొనుగోలు చేసి ఆహారంగా అందించారు.  పూర్తిగా కోలుకున్న తర్వాత గద్దను పైకి వదిలేశారు. ఈ సంఘటన జరిగి సుమారు 20 ఏళ్లు కావస్తోంది. పక్షులపై నాడు చిగురించిన ప్రేమ నేటికీ అతనిలో తగ్గలేదు. నాటి నుంచి నేటి వరకు ఆయన గద్దలకు మాంసం వేస్తూ తనవంతుగా పక్షులకు ప్రేమను పంచుతున్నారు. 

వృత్తిరీత్యా మెకానిక్‌...
త్రిమూర్తి పిళ్లై ద్విచక్రవాహనాల మెకానిక్‌. నాంపల్లి ఏరియా ఆసుపత్రికి వెనుక వైపు ఫుట్‌పాత్‌పై మెకానిక్‌ షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. వికలాంగుడు కావడం చేత ప్రభుత్వం సైతం సహకరిస్తోంది. త్రిమూర్తి పిళ్లై మెకానిక్‌గా స్థిరపడినప్పటికి ఆయన గొప్ప జంతు ప్రేమికుడు. ఆయన మనసంతా జంతువులు, పక్షుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే ఉడుతలకు, చీమలకు ఆహారాన్ని అందిస్తారు. నాంపల్లిలోని ఆయన నివాసం వద్ద తెలవారగానే ఉడతలు ఆహారం కోసం అరుస్తూ కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. నెలలో రెండు పర్యాయాలు నర్సాపూర్‌ అడవులకు అద్దె కారులో వెళ్లి అక్కడ ఉండే కోతులకు పల్లీలను ఆహారంగా ఇస్తారు. అంతేకాదు ఆలయాల వద్ద గోవులకు ఆహారాన్ని అందిస్తారు. అనాథలకు అండగా నిలుస్తూ వారికి దుస్తులు అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదన్న కారణంతో అరటి పండ్లను ఇస్తారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు పిళ్లై దైనందిన దినచర్యలో భాగం అయ్యాయి. 

గద్దలకే అధిక వ్యయం....  
ఆకాశంలో ఎగిరే గద్దలంటే త్రిమూర్తి పిళ్లైకు చాలా ఇష్టం. సాయంత్రం 5 గంటలు అయ్యిందంటే చాలు వాటికి ఆహారం ఇవ్వడం పరిపాటిగా మారింది. త్రిమూర్తి పిళ్లైకు సుస్తీ చేసినా, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పడు తన దగ్గర మెకానిక్‌గా శిక్షణ పొందే యువకులకు బాధ్యతలు అప్పగిస్తారు. ముర్గీ మార్కెట్‌లో ప్రతి రోజూ నాలుగు కిలోల చికెన్‌ కలేజాను కొనుగోలు చేస్తారు. తనతో పాటు శిష్యులతో కలిసి ఆకాశంలో ఎగిరే గద్దలకు మాంసాన్ని విసిరివేస్తారు.

సంపాదనలోకొంచెం సామాజిక సేవకు
ఆశాంలో ఎగిరే పక్షులు పతంగుల మాంజాలకు బలవుతున్నాయి. పక్షులు అనుభవిస్తున్న క్షోభను చూస్తే ఎవరికైనా బాధేస్తుంది. వాటిని రక్షించాల్సిన అవసరం ఉంది. విదేశాలకు చెందిన మాంజాలను నిషేధించాలి. నేను సంపాదించిన ఆదాయంలో ప్రతి రోజూ రూ.800 వరకు సామాజిక సేవకు ఖర్చు పెడతాను. ఈ సేవ నాకెంతో తృప్తినిస్తోంది. – త్రిమూర్తి పిళ్లై, జంతుప్రేమికుడు 

మరిన్ని వార్తలు