నేనొచ్చాక.. తీరిగ్గా మీరొస్తారా

29 Jul, 2018 12:42 IST|Sakshi
ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి

టేక్మాల్‌(మెదక్‌) : రెవెన్యూ అధికారులపై మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి సీరియస్‌ అయ్యారు. పనితీరు బాగాలేదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 10:15 గంటలకు తహసీల్దార్‌ కార్యాలయానికి ఆకస్మికంగా వచ్చారు. ఆ సమయంలో కంప్యూటర్‌ ఆపరేటర్, అంటెడర్లు తప్ప ఏ ఒక్క అధికారి కార్యాలయానికి రాలేదు. కలెక్టర్‌ వచ్చిన విషయాన్ని ఫోన్‌లలో సమచారం అందుకున్న వీఆర్‌ఓలు, తహశీల్దార్‌ ఒక్కొక్కరుగా 11 గంటల తర్వాత హాజరుకావడంతో సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనొచ్చాక.. తీరిగ్గా మీరు వస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

రైతుబంధు కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన భూ సవరణ వివరాలు ఆన్‌లైన్‌ ఎంత మేరకు చేశారని వీఆర్‌ఓలను ప్రశ్నించగా ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేదు. చేసిన వారిలో కూడా తప్పుల సవరణ సరిగ్గా చేయలేదని మండిపడ్డారు. రికార్డులను పరిశీలించిన అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన 39 వేల భూ సమస్యలను పరిష్కరించామని పంపగా 28వేల సమస్యల్లో ఏ ఒక్కటీ సరిగ్గా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ఒక్క అధికారి కూడా ఫీల్డ్‌ లెవల్‌ పనులు చేయడం లేదన్నారు.

వీఆర్‌ఓ సస్పెన్షన్‌
విధుల్లో నిర్లక్ష్యం వహించి రైతుల నుంచి వచ్చిన భూ సమస్యల సవరణ పూర్తి చేయని ఎల్లుపేట, వెల్పుగొండ వీఆర్‌ఓ సత్యనారాయణను సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. పనుల్లో అలసత్వం వహిస్తున్న తహసీల్దార్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. భూ సమస్యలను పరిష్కరించడంలో టేక్మాల్‌ మండలం అట్టడుగున ఉందన్నారు. ఇంకా 11వేల దరఖాస్తులకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని బొడ్మట్‌పల్లి గ్రామాన్ని సందర్శించి భూ రికార్డులను పరిశీలించారు. రికార్డు సవరణలు ఫీల్డ్‌కు రాకుండా చేశారని వీఆర్‌ఓ ఖదీర్‌పై మండిపడ్డారు. ప్రజల నుంచి ఎటువంటి భూ సమస్యలు తమ దృష్టికి రాకుండా చూసుకోవాలన్నారు.

తాగునీటి పథకం పనులపై ఆగ్రహం
మెదక్‌ అర్బన్‌ :  పట్టణానికి తాగునీరు అందించే పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయని  కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో మెదక్‌ పట్టణానికి తాగునీరు అందించే పథకంపై అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాగునీటి పథకం పనుల్లో గత పదిహేను రోజులుగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. ప్రతినిత్యం 300 నల్లాలు బిగించాల్సి ఉండగా ఇప్పటి వరకు మొత్తం 275 నల్లాలు మాత్రమే బిగిస్తే ఎన్నిరోజులు సమయం తీసుకుంటారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ వీరప్ప, డిప్యూటీ ఇంజినీర్‌ గోపాల్, మెదక్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు