‘కరోనా’పై నిర్లక్ష్యం వద్దు..

8 Apr, 2020 13:32 IST|Sakshi

జిల్లాలో ఆ ముగ్గురికి నెగెటివ్‌

‘గాంధీ’లో చికిత్స పొందుతున్న ఢిల్లీ బాధితుడు

జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలు

మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా జిల్లా  యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్, కర్ఫ్యూను పక్కాగా అమలు చేస్తున్నాయి. అయితే.. జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో నలుగురు కరోనా వైరస్‌ బారిన పడడంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ తర్వాత ఇందులో ముగ్గురికి నెగెటివ్‌ రాగా.. ఢిల్లీ బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో జిల్లా         యంత్రాంగంతో పాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ.. కరోనాపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దని.. అప్రమత్తతే శ్రీరామ రక్ష అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వారం మరింత కీలకమని.. ఇల్లు విడిచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.        – సాక్షి, మెదక్‌

మెదక్‌ పట్టణంలోని ఆజంపుర వీధికి చెందిన 56 ఏళ్ల వ్యక్తి ఢిల్లీకి వెళ్లి వచ్చాడు. దీంతో అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు 12 మంది, రాళ్లమడుగులోని నలుగురు బంధువులను ఏడుపాయలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచారు. అంతకు ముందు వారిని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి నమూనాలను సేకరించారు. వాటిని పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించగా ఇందులో ముగ్గురికి (బాధితుడి భార్య, కూతురు, కోడలు) ఈ నెల మూడో తేదీన పాజిటివ్‌గా వచ్చింది. ఈ క్రమంలో వీరిని ఆ రోజే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సోమవారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు ధ్రువీకరించారు. నెగెటివ్‌గా వచ్చినప్పటికీ వారిని హైదరాబాద్‌ మల్లెపల్లిలోని హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు వెల్లడించారు.

127 మంది ప్రవాసులకు ముగిసిన క్వారంటైన్‌..
కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య, పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో విదేశాల నుంచి 127 మంది జిల్లాకు వచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు వారిని హోంక్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీరెవరు ఇళ్ల నుంచి బయటకు రాకుండా గ్రామస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆశ వర్కర్లు, రెవెన్యూ సిబ్బందితో పక్కా నిఘా పెట్టారు. ప్రస్తుతం వీరందరి క్వారంటైన్‌ గడువు ముగిసింది. ఎవరకి సైతం కరోనా లక్షణాలు వెలుగు చూడకపోవడంతో వారితోపాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రభుత్వ క్వారంటైన్‌లో 40 మంది..  
ఢిల్లీ ప్రార్థనలకు జిల్లా నుంచి 12 మంది వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వీరిని ఏడుపాయలలోని హరిత హోటల్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. ఈ క్రమంలో వారి వారి సన్నిహితులెవరు.. జిల్లాలో ఏయే చోట్ల తిరిగారు.. ఎవరెవరిని కలిశారు.. వంటి అంశాలపై వైద్య సిబ్బంది జల్లెడ పట్టారు. ఈ క్రమంలో గుర్తించిన వారందరినీ ఏడుపాయలతోపాటు మెదక్‌ హరితలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో మొత్తం 40 మంది ఉన్నారు. ఈ నెల 11తో వారి క్వారంటైన్‌ గడువు ముగియనుందని వైద్యాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే ఎలాంటి ఆందోళన లేదని.. అయితే కరోనాపై ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించొద్దని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని.. రావాల్సి వస్తే భౌతిక దూరం పాటించాలని అంటున్నారు.

లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం
కరోనాపై యుద్ధంలో భాగంగా జిల్లాలో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేసే దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. లాక్‌డౌన్‌ వేళ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం రేషన్‌ పంపిణీ చేస్తోంది. రైతులకు ఇక్కట్లు లేకుండా ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభించింది. కాలనీల్లోనే కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో జనసమూహం లేకుండా జిల్లా పోలీసులు శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

అప్రమత్తత తప్పనిసరి..
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అందరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ వారం.. పది రోజులు కీలకం. కొత్త కేసులు నమోదు కాకుంటే ఆ మహమ్మారిని జయించినట్లే. ఇల్లు విడిచి బయటకు వెళ్లొద్దు. చేతులు ఎప్పటికప్పుడూ శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.– వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు