స్టూడెంట్‌ పోలీస్‌తో దురాచారాలకు చెక్‌!

17 Jul, 2019 14:04 IST|Sakshi

సాక్షి, మెదక్‌: మున్సిపాలిటీ: సమాజంలో దురాచారాలను పారదోలేందుకే స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మెదక్‌ పట్టణంలోని వేంకటేశ్వర గార్డెన్‌లో స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని ఆదుకోవడం పోలీస్‌ శాఖ మొదటి కర్తవ్యమన్నారు.

పోలీస్‌ శాఖకు కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, పేద లింగ బేధం తేడా ఉండవని, అందరికి సమన్యాయం చేస్తూ పని చేసేదే వ్యవస్థ అని వివరించారు. ఈ వ్యవస్థలో స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌ను భాగస్వాములను చేస్తూ సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను పారద్రోలే విధంగా వీరిని తయారు చేస్తామన్నారు.  అలాగే పోలీస్‌ శాఖలో ఒక వినూత్న ప్రయోగానికి మెదక్‌ జిల్లా వేదికయ్యిందన్నారు.  ఇప్పటి వరకు లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్, ట్రాఫిక్‌ పోలీస్, ఎక్సైజ్‌ పోలీస్‌ ఇలా వివిధ రకాల పోలీసులను చూశామని,  ఇప్పటి వరకు చూడని ఒక కొత్త పోలీస్‌ను మెదక్‌  జిల్లాలో  చూడబోతున్నారని తెలిపారు.

 అతడే స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌ అన్నారు. పోలీస్‌ శాఖపై ప్రజల్లో ఉన్న ప్రతికూల అంశాలకు సంబంధించి వారి దృక్పథంలో మార్పు తెచ్చేందుకు స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌ను రూపుదిద్దుతున్నామని చెప్పారు.  ఇది పోలీస్, విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  ఇందుకోసం ఎంపిక చేసిన 440 మంది  విద్యార్థులకు  ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్‌ సిబ్బందితో ప్రతి శుక్ర, శనివారాల్లో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి, విద్యాశాఖ నోడల్‌ అధికారి మధుమోహన్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, మెదక్‌ పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్‌బీఎస్‌ఐ రాంబాబు, ఏఎస్‌ఐ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు