చాన్స్‌ లేనట్టే!

19 Feb, 2019 11:03 IST|Sakshi

మంత్రివర్గ విస్తరణలో ఆశావహ ఎమ్మెల్యేలకు నిరాశే..

రికార్డు మెజారిటీ సాధించినా హరీశ్‌కు దక్కని అవకాశం

చివరి నిమిషం వరకు సోలిపేట, పద్మ ఎదురుచూపు

1970 దశకం నుంచి అన్ని కేబినెట్లలోనూ జిల్లా నేతలు

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్‌ ముహూర్తం నిర్ణయించారు. కొత్తగా 9 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్వపు మెదక్‌ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, సంగారెడ్డి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. సిద్దిపేట నుంచి హరీశ్‌రావు వరుసగా ఆరో పర్యాయం విజయం సాధించడంతో పాటు, ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చిన శాసనసభ్యులు పద్మా దేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ఏ ఒక్క శాసనసభ్యుడికి మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంపై చర్చ జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : గజ్వేల్‌ నుంచి వరుసగా రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్‌ గత ఏడాది డిసెంబర్‌ 13న వరుసగా రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ హోం శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన సుమారు రెండు నెలల తర్వాత తాజాగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు మంగళవారం ముహూర్తం నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో తొమ్మిది మంది శాసనసభ్యులకు మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిది చోట్ల విజయం సాధించింది. 

ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి  కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఉద్యమనేతగా, నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచిన హరీశ్‌రావుకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావించారు. పిన్న వయసులోనే వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డుతో పాటు, ఏకంగా లక్షా ఇరువై వేల మెజారిటీతో విజయం సాధించిన ఘనత హరీశ్‌ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయనకు ప్రాధాన్యత ఉన్న శాఖ దక్కుతుందని భావించినా, తాజా విస్తరణలో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. 

మరో ఇద్దరు నేతలకు నిరాశ
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ, అసెంబ్లీకి నాలుగో పర్యాయం ఎన్నికైన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించారు. మరో ఉద్యమ నేత, అసెంబ్లీకి మూడో పర్యాయం ఎన్నికైన మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. సీఎం కేసీఆర్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, హరీశ్‌తో సహా ఇతర ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో హరీశ్‌కు చోటు కల్పించిన విషయాన్ని ఆయన అనుచరులు ప్రస్తావిస్తున్నారు.

70వ దశకం తర్వాత ఇదే తొలిసారి
ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి 1970వ దశకం నుంచి ఏర్పాటైన ప్రతీ మంత్రిమండలిలోనూ జిల్లాకు చెందిన శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 1970వ దశకంలో పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో జిల్లా నుంచి మదన్‌ మోహన్‌ ప్రాతినిధ్యం వహించారు. మర్రి చెన్నారెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంలోనూ మదన్‌మోహన్‌తో పాటు బాగారెడ్డికి మంత్రి పదవి దక్కింది. టి.అంజయ్య జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన సందర్భంలోనూ మదన్‌మోహన్‌కు మంత్రి పదవి దక్కింది.

1983, 85లో ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో కరణం రామచంద్రరావు, 1989లో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి వర్గాల్లో గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కొంతకాలం పి.రామచంద్రారెడ్డి కూడా కోట్ల మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించారు. 1994 నాటి ఎన్టీఆర్‌ కేబినెట్‌లో కరణం రామచంద్రరావు, ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గంలో కరణం, ముత్యంరెడ్డి, బాబూమోహన్‌ పనిచేశారు. ప్రస్తుత సీఎం కేసీఆర్‌ అటు ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లోనూ కొంతకాలం మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 మధ్యకాలంలో వైఎస్, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో గీతారెడ్డి,  ఫరిదుద్దీన్, దామోదర రాజనర్సింహ, సునీత లక్ష్మారెడ్డి మంత్రులుగా పనిచేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఏ ఒక్కరికీ చోటు దక్కకపోవడం ఆరు దశాబ్దాల్లో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 
 

మరిన్ని వార్తలు