విరిసిన విద్యా కుసుమాలు

19 Apr, 2019 08:31 IST|Sakshi

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బాలికలే టాప్‌

రాష్ట్రంలోనే మేడ్చల్‌ జిల్లా ప్రథమం

ద్వితీయ స్థానంలో రంగారెడ్డి జిల్లా

మళ్లీ వెనకబడిన హైదరాబాద్‌

సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలుర కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. గ్రేటర్‌ పరిధిలోని మేడ్చల్‌ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఎప్పటి మాదిరిగానే హైదరాబాద్‌ జిల్లా వెనకబడింది.   ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా 76 శాతం సాధించి రాష్ట్రంలోనే టాప్‌గా నిలిచింది. గతేడాది కంటే నాలుగు శాతం తగ్గినా తన స్థానాన్ని మాత్రం పదిలపర్చుకోగలిగింది. 

ఈసారి కూడా ఉత్తీర్ణత శాతంలో సైతం బాలికలదే పైచేయిగా మారింది. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 71 శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 82 శాతం, బాలురు 70 శాతం ఉత్తీర్ణత సాధించారు, ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 72 శాతం సాధించి రాష్ట్రంలోనే  రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచింది.  ప్రథమ సంవత్సర ఫలితాల్లో మాత్రం 71 శాతంతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ కూడా బాలికలు పైచేయిగా నిలిచారు. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో బాలికలు 77 శాతం, బాలురు 68 శాతం, ప్రథమ సంవత్సరంలో బాలికలు 75 శాతం, బాలురు 67 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇక హైదరాబాద్‌ జిల్లా ఎప్పటి మాదిరిగానే  వెనకబడిపోయింది. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో  62 శాతం సాథించి రాష్ట్రస్థాయిలో పదో స్థానానికి పడిపోగా, ప్రథమ సంవత్సరంలో మాత్రం 61 శాతంతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణత శాతంలో ఎప్పటి మాదిరిగానే బాలికలదే పైచేయిగా మారింది. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 72 శాతం, బాలురు 53 శాతానికి పరిమితమయ్యారు. ప్రథమ సంవత్సరంలో 70 శాతం బాలికలు, 53 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు.

విజ్ఞాన్‌ విజయభేరి
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల నిజాంపేట, కొండాపూర్‌ బ్రాంచ్‌లకు చెందిన  విద్యార్ధులు విజయభేరి మోగించినట్లు విజ్ఞాన్‌ విద్యాలయాల వైస్‌ చైర్‌పర్సన్‌  రాణీ రుద్రమదేవి తెలిపారు. ఎంపీసీ  ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఆర్‌.సాయిశ్రీ 987, ఆర్‌. పల్లవి 982, సూర్యవంశీ 982, వై.సృజన 980, శ్రీజ 979, లోకేశ్‌ 976, శివకుమార్‌ 976, సాత్విక్‌ 975 మార్కులు సాధించినట్లు చెప్పారు. మొదటి సంవత్సంలోనూ ప్రతిభ చాటినట్లు వివరించారు.   

సత్తా చాటిన ‘రాయల్‌’ విద్యార్థులు
అమీర్‌పేట: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో హైదరాబాద్‌ రాయల్‌ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్‌ కె.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం విడుదలైన జూనియర్, సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో తన్మయి 464/470, ఎంఈసీలో 479/500 మార్కులు సాధించారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో భవాని సుప్రియ 978/1000, ఎంఈసీలో 955/1000 సాధించారన్నారు. హెచ్‌ఈసీలో అనురాధ 486, సింధు 483 టాపర్‌గా నిలిచారని తెలిపారు. సాధారణ ప్రతిభగల విద్యార్థులతో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి అనుభవం గల అధ్యాపకులు, పటిష్ఠమైన పాఠ్యప్రణాళిక దోహదపడ్డాయన్నారు. సమావేశంలో డైరెక్టర్లు సీహెచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, జీవీ కృష్ణారెడ్డి, కె.చంద్రమౌళీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఒకేషనల్‌ కోర్సులోనూ..
ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సులోనూ సైతం బాలికలు సత్తాచాటారు. ద్వితీయ సంవత్సరంలో హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లా 70 శాతం చొప్పున ఉత్తీర్ణత సాధించగా,  రంగారెడి జిల్లాకు 70 శాతం ఉత్తీర్ణత లభించింది.  బాలికలు హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాలో 84 శాతం చొప్పున, రంగారెడ్డి జిల్లాలో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు మాత్రం హైదరాబాద్‌లో 59 శాతం, మేడ్చల్‌లో 62 శాతం, రంగారెడ్డిలో 59 శాతం ఉత్తీర్ణతకు పరిమితమయ్యారు. ప్రథమ సంవత్సరం ఫలితాలు పరిశీలిస్తే హైదరాబాద్‌ 56 శాతం, మేడ్చల్‌ 53 శాతం, రంగారెడ్డి 57 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అందులో బాలికలు హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాలో 73 శాతం చొప్పున, రంగారెడ్డి 69 శాతం చొప్పున ఉత్తీర్ణత సాధించారు. బాలురు హైదరాబాద్‌లో 42 శాతం, మేడ్చల్‌లో  37 శాతం, రంగారెడ్డి జిల్లాలో 47 శాతం ఉత్తీర్ణత సాధించారు.  

ప్రైవేట్‌ అభ్యర్థులు ఇలా..
ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ప్రైవేటు పరీక్ష రాసిన విద్యార్థుల విభాగంలో మాత్రం తక్కువ శాతం ఉత్తీర్ణత లభించింది. హైదరాబాద్‌లో 20 శాతం, మేడ్చల్‌లో 25 శాతం, రంగారెడ్డి జిల్లాలో 21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్‌ ప్రైవేట్‌ విభాగంలో హైదరాబాద్‌ 54 శాతం, మేడ్చల్‌ జిల్లా 68 శాతం, రంగారెడ్డి జిల్లా 58 శాతం ఉత్తీర్ణత సాధించాయి.    

మట్టిలో మాణిక్యాలు..
బన్సీలాల్‌పేట్‌: చదువుకు పేదరికం అడ్డుకాబోదని నిరూపించారు ఆ విద్యార్ధులు. నిరుపేద కుటుంబానికి చెందిన పలువురు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో సత్తా చాటారు. కష్టాలను అధిగమించి మెరుగైన ఫలితాలు సాధించారు. ఒకరు ప్రైవేట్‌ ఉద్యోగి కొడుకు కాగా, మరొకరు సామాజిక ఉద్యమకారుడి కుమారుడు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బైపీసీ, సీఈసీలో చక్కటి ప్రతిభ కనబర్చారు. సదరు విద్యార్థులను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. 

బైపీసీలో ఉత్తమ్‌ రాయ్‌..  
రాంపల్లి ప్రాంతానికి చెందిన ఉత్తమ్‌ రాయ్‌ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ బైపీసీలో 986/1000 సాధించాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఉత్తమ్‌ రాయ్‌ చిన్నప్పటి నుంచి చదువులో చక్కటి ప్రతిభ కనబరిచేవాడు. 10వ తరగతి ఫలితాల్లో కూడా మంచి మార్కులు సాధించాడు. ప్రైవేట్‌ ఉద్యోగి అయిన లక్ష్మణ్‌ ఎన్నికష్టాలు ఎదురైనా తన కుమారున్ని బాగా చదివించాడు.  
గురువారం విడుదలైన ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో 1000 మార్కులకుగాను 986 మార్కులు సాధించారు. శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీ మియాపూర్‌ హైదర్‌బస్తీ బ్రాంచీలో ఉత్తమ్‌ రాయ్‌ బైపీసీ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదివాడు. భవిష్యత్తులో డాక్టర్‌నవుతానన్నాడు. 

మురికివాడ నుంచి..
బన్సీలాల్‌పేట్‌ మురికివాడ బండమైసమ్మనగర్‌ ప్రాంతానికి చెందిన కె.సుచంద్ర ఇంటర్‌ సీఈసీ సెకండ్‌ ఇయర్‌లో చక్కని ప్రతిభ పాఠవాలను కనబర్చాడు. ఇంటర్‌ సీఈసీ సెకండ్‌ ఇయర్‌లో 836/1000 సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన సుచంద్ర ఓ వైపు క్రికెట్‌లో రాణిస్తూ మరోవైపు చదువులో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. సామాజిక ఉద్యమకారుడైన కె. రాజెల్లయ్య కుమారుడు సుచంద్ర. సుచంద్రను కుటుంబ సభ్యులు అభినందించారు. 

మరిన్ని వార్తలు