మంచిర్యాలకు వైద్య కళాశాల!

12 Sep, 2019 11:19 IST|Sakshi
మంచిర్యాల జిల్లా ఆసుపత్రి

మంత్రి ఈటల ప్రకటనతో ప్రజల్లో ఆనందం

జిల్లా ఆసుపత్రి కోసం 27 ఎకరాలు కేటాయింపు

సాక్షి, మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల, కుమురంభీం జిల్లా ప్రజలకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయి. రెండు జిల్లాలకు దిక్కుగా ఉన్న ఏకైక జిల్లా ఆసుపత్రికి త్వరలోనే వైద్య కళాశాల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఖమ్మం ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపినట్లు మంత్రి ప్రకటించడంతో జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా ఏర్పాటుకు ముందు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిగా సేవలు అందించి.. జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా ఆసుపత్రిగా మారింది.

వంద పడకల ఆసుపత్రిగా ఉన్న ప్రభుత్వాసుపత్రిని 250 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తూ.. 2018 ఫిబ్రవరి 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం 250 పడకలకు సరిపోకపోవడంతో అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ కళాశాల రోడ్డులో ఉన్న భూదాన్‌ భూమి 27 ఎకరాలను ప్రభుత్వాసుపత్రితోపాటు, మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి కేటాయించారు. ఏడాది క్రితం మాతాశిశు సంరక్షణ కేంద్రం భవన నిర్మాణం కోసం టెండర్లను పూర్తి చేసి పనులు ప్రారంభించారు.

జిల్లా ఆసుపత్రి నిర్మాణం కోసం టెండర్లను పిలవాల్సి ఉండగా.. మంత్రి ప్రకటనతో వైద్య కళాశాలను భూదాన్‌ భూమిలోని 27 ఎకరాల్లోనే నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ప్రస్తుతం కేటాయించిన 27 ఎకరాల స్థలంపై బుధవారం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ యశ్వంత్‌రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో త్వరలోనే వైద్యకళాశాలకు మోక్షం కలిగేందుకు అవకాశం ఉండడంతో రెండు జిల్లాల ప్రజల్లో ఆనందం నెలకొంది.

వైద్యకళాశాల ఏర్పాటుతోనే సమస్యలు దూరం
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌లో రిమ్స్‌ వైద్యశాల ఉంది. కొత్తగా ఏర్పడిన ఏ జిల్లాలోనూ వైద్య కళాశాలగాని, 250 పడకల ఆసుపత్రులుగానీ లేవు. మంచిర్యాల ఏరియా ఆసుపత్రి వంద పడకల నుంచి 250 పడకలకు అప్‌గ్రేడ్‌ చేసినా.. అందుకు సరిపడా సౌకర్యాలు కల్పించలేదు. మంత్రి ఈటల రాజేందర్‌ రాష్ట్రం లో మూడు వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రతి పాదనలు పంపినట్లు ప్రకటించడంతో జిల్లాకు 250 పడకలకు బదులు 500 పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకోనుంది.  

ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనంలో గదులు సరిపోకపోవడంతో వరండాల్లోనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవ నం చిన్నపాటి వర్షానికే ఉరుస్తూ, పైకప్పుపెచ్చులు ఊడుతోంది. ఇరుకైన గదులు, వరండాల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్‌కు ఇబ్బంది తలెత్తుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురికి నీరు బయటకు వెళ్లడం లేదు. పారిశుధ్యం మెరుగుపర్చినా.. ఆసుపత్రి ఆవరణ దుర్వాసన వెదజల్లుతోంది.

గతంలో ఏరియా ఆసుపత్రిగా ఉన్నప్పుడు రోజుకు 300 మంది ఓపీ రాగా.. ఇప్పుడు 600కు పైగా వస్తున్నారు. 260కి పైగా రోగులు ప్రతిరోజూ ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. గతంలో నెలకు 50 ప్రసవాలు జరగగా.. ప్రస్తుతం 360కి పైగా జరుగుతున్నాయి. వైద్యకళాశాల ఏర్పాటుతో 500 పడకల ఆసుపత్రిగా మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి మారితే కొత్త భవనంలో, అన్నిరకాల వసతులతో రోగులకు చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. సింగరేణి సంస్థ తన లాభాల నుంచి ప్రజలకు ఉపయోగపడేందుకు నిధులు వెచ్చిస్తుంది. 

అందులో అధికభాగం వైద్యరంగానికే అందిస్తోంది. సింగరేణి సంస్థ సహకారంతోనే ప్రస్తుత జిల్లా ఆసుపత్రిలో ఐసీ యూ ఏర్పాటుతోపాటు, సీటీస్కాన్, బ్లడ్‌బ్యాం కులో కోట్లు విలువ చేసే యంత్రాలను కొనుగోలు చేసి అందించింది. వీటిని వినియోగంచుకునేందుకు సరైన సదుపాయాలు ప్రస్తుత ఆసుపత్రి భవనంలో లేకపోయినా.. ఉన్న గదుల్లోనే వినియోగిస్తున్నారు. కొత్త భవనంలోకి మారితే ప్రస్తుతం ఉన్న ఆధునిక పరికరాలను రోగుల కోసం వినియోగించేందుకు అవకాశం ఉంటుంది.

రోడ్డు ప్రమాదాలు జరిగి నప్పుడు ప్రాథమి కంగా మాత్రమే మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తున్నారు. వైద్య కళాశాల పూర్తయితే మంచిర్యాల, కుమురంభీం జిల్లాల ప్రజలకు అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
 

మరిన్ని వార్తలు