ఎమ్మార్పీకి ‘బెల్టు’తో బురిడీ!

1 Apr, 2018 04:31 IST|Sakshi

‘లిక్కర్‌ ప్రైస్‌’ యాప్‌కు బెల్ట్‌ షాపులతో వ్యాపారుల చెక్‌

దుకాణాల్లో మద్యం అమ్మకాలు తగ్గించి.. ఆ సరుకంతా బెల్టు షాపుల్లో విక్రయం

 ప్రతి క్వార్టర్‌ సీసా మీద రూ. 5 అదనం 

సాక్షి, హైదరాబాద్‌: మద్యం వ్యాపారులు రూటు మార్చారు. ఎమ్మార్పీ నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుండటం, పర్మిట్‌ రూం సామర్థ్యం చూపించి ఎక్సైజ్‌ అధికారులు వసూళ్లు చేస్తుండటంతో కొత్త పంథా ఎంచుకున్నారు. దుకాణం ద్వారా రోజువారిగా విక్రయించే మద్యంను సగానికి కుదించుకోని ఆ మొత్తాన్ని బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రతి క్వార్టర్‌ సీసా మీద కనీసం రూ. 5 చొప్పున ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీంతో చట్టవిరుద్ధమైన ఈ బెల్టు దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులు నమోదు చేయడం కుదరక ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కళ్లు తేలేస్తోంది. అక్రమ మద్యం కేసులు పెట్టి బెల్టు లేకుండా చేస్తే మద్యం విక్రయాల రేటు పడిపోతుందని వెనకడుగు వేస్తోంది.  

నిబంధనలు పాటిస్తూనే.. 
మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ధర ఉల్లంఘనను నిరోధించడంతో పాటు అక్రమ, కల్తీ మద్యాన్ని నిరోధించడం కోసం ’లిక్కర్‌ ప్రైస్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో విక్రయిస్తున్న 880 లిక్కర్‌ బ్రాండ్లను ఈ యాప్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రతి సీసాకు సంబంధించి క్వార్టర్, ఫుల్‌ బాటిల్‌ ఎమ్మార్పీ ఎంత? ఏ డిపో నుంచి తెచ్చారు?.. తదితర విషయాలను యాప్‌తో తెలుసుకోవచ్చు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే ఆ యాప్‌ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు. వాట్సాప్‌ నంబర్‌ 7989111222, టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004252523కు కూడా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. నిర్ణీత సమయం తరువాత మద్యం విక్రయించినా, సమయం కంటే ముందే దుకాణం తెరిచినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. దీంతో గతంలో టెండర్లు వేసినా లైసెన్స్‌ దక్కని పాత మద్యం వ్యాపారులు నిత్యం దుకాణాల మీద కన్నేసి.. అవకాశం దొరికితే ఫిర్యాదు చేస్తున్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులో దొరికితే రూ. 2 లక్షల జరిమానా, 7 రోజుల పాటు లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేస్తోంది. దీంతో ఈ సమస్యలకు మద్యం వ్యాపారులు విరుగుడు కనిపెట్టారు.  

బెల్టుతో రూ. 8 వేల కోట్ల వ్యాపారం  
దుకాణంలో నిబంధనలు పాటిస్తూనే.. రోజు వారి మద్యం విక్రయాలను సగానికి తగ్గించారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి మద్యం దుకాణంలో సగటున 75 నుంచి 100 కేసుల మద్యం విక్రయించేవాళ్లు. ఇప్పుడు 40 నుంచి 45 పెట్టెలకు మించి అమ్మడం లేదు. మిగిలిన మద్యాన్ని బెల్టు దుకాణాలకు తరలించి ఎమ్మార్పీ మీద రూ. 5 అదనపు ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 8,685 రెవెన్యూ గ్రామాలు, 21 వేల హాబిటేషన్లు ఉన్నాయి. ప్రతి రెవెన్యూ గ్రామంలో సగటున 5 చొప్పున, ప్రతి హాబిటేషన్‌ గ్రామంలో ఒకటి చొప్పున 65 వేలకు పైగా బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఏటా రూ. 8 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. 

ఎక్సైజ్‌ అధికారుల మధ్యవర్తిత్వం
ఏడాదికి కనీసం 633 లక్షల కేసుల మద్యం విక్రయించాలని ప్రభుత్వం టార్గెట్‌గా నిర్ణయించింది.  కానీ అధీకృత మద్యం దుకాణాల ద్వారా 50 శాతం మద్యం కూడా అమ్ముడవదు. దీంతో బెల్టు దుకాణాలను ఎక్సైజ్‌ శాఖ ప్రోత్సహిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ మద్యం దుకాణాలున్న మండలాల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసే విషయంలో వ్యాపారులకు గొడవలు రాకుండా ఎక్సైజ్‌ అధికారులే మధ్య వర్తిత్వం చేసి ఊళ్లను పంచారు. ఒకరికి కేటాయించిన గ్రామంలో మరో వ్యాపారి అడుగు పెట్టకూడదు. ఒప్పందం అతిక్రమించిన వారిపై అధికారులు అక్రమ మద్యం వ్యాపారం కేసులు పెడుతున్నారు. 

మరిన్ని వార్తలు