కృష్ణానదిలో.. ‘అలవి’ వేట! 

30 Jan, 2020 10:19 IST|Sakshi
అలవి వలలు లాగుతున్న ఆంధ్రా మత్స్యకారులు

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : కృష్ణానదిలో నిషేధిత అలవి వలల వేట కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నిషేధించినప్పటికీ దళారులు దందాను దర్జాగా కానిస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలైన వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పరిధిలో ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. పోలీసు, మత్స్యశాఖ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా, పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోడం లేదు. మంగళవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడు వద్ద టాస్క్‌ఫోర్స్‌ అధికారుల దాడుల్లో ఏడు అలవి వలలు పట్టుబడ్డాయి. 

ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు 
గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పరిధిలోని కృష్ణానది తీర గ్రామాల మత్స్యకారులు, ప్రజలు దళారుల చర్యలతో ఉపాధి కోల్పోతున్నారు. ప్రతి ఏటా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు సుమారు ఎనిమిది నెలల పాటు ఈ ప్రాంత మత్స్యకారులు చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటారు. కొంత మంది దళారులు అత్యాశతో ఆంధ్రాలోని వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు తదితర ప్రాంతాల నుంచి జాలర్లను తీసుకొచ్చి అలివి వలలతో చేపలను పట్టిస్తుండడంతో చిన్నచిన్న చేపపిల్లలు కూడా ఈ వలలో చిక్కుకుని బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో స్థానిక మత్స్యకారులు నష్టపోతున్నారు.  


గుడారాల ముందు ఎండబెట్టిన చేపలు

నిషేధం ఉన్నప్పటికీ..  
ప్రభుత్వం అలవి వలలను నిషేధించింది. అయినా కొందరు అక్రమ సంపాదనే ధ్యేయంగా వాటిని వినియోగిస్తూ చిన్న చేపలను సైతం వేటాడుతూ మత్స్ససంపదను కొల్లగొడుతున్నారు. వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులతో అలవివేటను చేయిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోలు, సోమశిల, అదేవిధంగా వనపర్తి జిల్లా పరిధిలోని చిన్నంబావి, బెక్కెం, చెల్లపాడు, పెద్దమరూరు, చిన్నమరూర్, గ ద్వాల జిల్లా పరిధిలోని అలంపూ ర్, గొందిమళ్ల తదితర గ్రామాల పరిధిలోని కృష్ణాతీరంలో కొంత మంది దళారులు ఆంధ్రా మత్స్య కారులతో ఒప్పందాలు చేసుకొని అలవి వలలు ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ వలల్లో చిక్కుకుని 5 గ్రాముల చిన్నచిన్న చేపలు కూడా బయటికి వస్తాయి. వాటన్నింటినీ ఆరబోసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. చేపలు పెరిగి పెద్దయితే స్థానిక మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుంది.  రష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మత్స్యకారుల కోసం లక్షల చేపపిల్లలు నదిలో వదులుతుండగా అవి పెరిగి పెద్దవి కాకముందే దళారులు అలవి వలల ద్వారా వేటాడుతున్నారు. మత్స్యకారులు ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.  

నెరవేరని ప్రభుత్వ లక్ష్యం 
కృష్ణానదిలో చేపలు పట్టేవారిలో ఎక్కువశాతం ఆంధ్రాకు చెందిన మత్స్యకారులే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతానికి చెందిన వారు దళారుల అవతారం ఎత్తి అక్కడి మత్స్యకారులకు అడ్వాన్స్‌లు ఇచ్చి వారితో చేపల వేట చేస్తున్నారు. కృష్ణానది మధ్య దీవుల్లో నివాసం ఉంటూ చేపల వేటకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ లక్షలాది చేపపిల్లలను నదుల్లో, చెరువుల్లో వదిలి ఉపాధి కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు.

మరిన్ని వార్తలు