వెంట తెస్తున్నారు!

27 May, 2020 05:46 IST|Sakshi

రాష్ట్రంలో వలసదారులు, విదేశాల నుంచి వస్తున్న వారితో కరోనా వ్యాప్తి 

సడలింపుల తర్వాత వారి కారణంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

వలసదారుల్లో 145 మంది.. విదేశాల నుంచి వచ్చిన 28 మందికి పాజిటివ్‌

ఆందోళన చెందుతున్న వైద్య, ఆరోగ్య శాఖ..  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గడం లేదు. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కొంతమేరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి ద్వారా అధిక కేసులు నమోదయ్యాయి. దీంతో అప్పట్లో కేసుల సంఖ్య అధికంగా నమోదైంది. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు సడలింపులివ్వడంతో జాతీయంగా, అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న మన రాష్ట్రానికి చెందినవారు, ఇతరులు వస్తుండటంతో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఒకవైపు వివిధ రాష్ట్రాల్లో ఉండే మన తెలంగాణ వాసులు, అలాగే విదేశాల్లో ఉండే మనవారు కూడా ఇక్కడకు వస్తున్నారు. దీంతో వారి ద్వారా కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

సడలింపుల తర్వాత సోమవారం నాటికి విదేశాల నుంచి మన రాష్ట్రానికి ప్రత్యేక విమానాల్లో వచ్చినవారిలో 28 మందికి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 145 మంది వలసదారులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఉదాహరణకు ఒక్క సోమవారం నాడే రాష్ట్రంలో 66 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, అందులో 32 కేసులు రాష్ట్రంలో ఉన్నవారికి కరోనా సోకింది. మిగిలిన కేసుల్లో వలసదారులు 15 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మంది, మహారాష్ట్రకు చెందినవారు ఒకరున్నారు. అంటే ఒకరోజు నమోదైన కేసుల్లో సగానికిపైగా వలసలు, ఇతర దేశాల నుంచి వచ్చినవారే ఉండటం గమనార్హం. 

ఈ కేసులను ఎదుర్కోవడం ఎలా? 
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రయాణికులు వస్తుండటంపై వైద్య, ఆరోగ్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘అనుమానితులను గుర్తించి పరీక్షలు చేస్తున్నాం. గ్రామాల్లోనూ నిఘా పెట్టాం. కొత్త వాళ్లు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరాం. చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌లు పెట్టి లక్షణాలున్న వారిని పరీక్షిస్తున్నాం’ అని ఒక అధికారి తెలిపారు. ‘ఇప్పటికే లక్షకుపైగా వలసదారులు రాష్ట్రానికి వచ్చారు. వారిలో కొందరు మా కళ్లుగప్పి ఇళ్లకు వెళ్లారు. వారి కోసం వెతుకుతున్నాం’ అని ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిలో అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేసి, మిగిలిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నామని మరో అధికారి చెప్పారు.

మరిన్ని వార్తలు